logo

తారు దారులు.. తొలగు అగచాట్లు

జిల్లాలో తారు దారులన్నీ సుందరంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు గుంతలు పడిన రోడ్లతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడ్డారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం..

Updated : 27 Mar 2023 04:18 IST

రూ.11.27 కోట్లతో పనులు షురూ
సజావుగా ప్రయాణం
న్యూస్‌టుడే, బషీరాబాద్‌, పాత తాండూరు

ఇందర్‌చేడ్‌-బషీరాబాద్‌ మార్గంలో..

జిల్లాలో తారు దారులన్నీ సుందరంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు గుంతలు పడిన రోడ్లతో ప్రయాణికులు నిత్యం అవస్థలు పడ్డారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం.. వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఇటీవల ఎమ్మెల్యే ఆదేశించడంతో గుత్తేదారులు చకచకా చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్నీ సక్రమంగా పూర్తయితే ప్రయాణ కష్టాలు తీరుతాయని వాహనదారులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.  

పంచాయతీ, ఆర్‌అండ్‌బీ నిధుల రాక

జిల్లాలో మొత్తం 30 మండలాలు ఉండగా రోడ్ల నిర్మాణానికి ఒక్కో మండలానికి నిధులు విడుదల చేస్తున్నారు. తాజాగా బషీరాబాద్‌ మండలంలో పంచాయతీరాజ్‌ దారులకు రూ.7.85కోట్లు, రోడ్లు భవనాల శాఖ దారుల నిర్మాణానికి రూ.3.42కోట్లు మంజూరయ్యాయి. మైల్వార్‌-కంసాన్‌పల్లి (బి) రూ.64.6లక్షలు, పర్వత్‌పల్లి గేట్‌ నుంచి ఊరి వరకు రూ.42లక్షలు, నవల్గా-మైల్వార్‌ రూ.50లక్షలు, కాశింపూరు నుంచి బాద్లాపూర్‌ మీదుగా గొట్టిగకలాన్‌ వరకు రూ.30లక్షలు, బషీరాబాద్‌-ఇందర్‌చేడ్‌కు రూ.66లక్షలు, నవల్గా-మైల్వార్‌ వరకు 5.15 కోట్లు మంజూరు కాగా.. పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ నిధులతో బషీరాబాద్‌-మైల్వార్‌, జీవన్గీ-కరణ్‌ కోట్‌ దారుల పనులు త్వరలో ప్రారంభిస్తామని అశాఖ అధికారులు చెబుతున్నారు.

పెండింగ్‌లో ఉన్నవి సైతం..

భోజ్యా నాయక్‌ తండా నుంచి గ్రామం వరకు, నవల్గా నుంచి బాబునాయక్‌ తండా, హంక్యా నాయక్‌ తండా, ప్రధాన దారి నుంచి హంక్యానాయక్‌ తండా వరకు, బషీరాబాద్‌ నుంచి తౌర్యానాయక్‌ తండా, పర్ష్యానాయక్‌ తండా వరకు మట్టి దారుల నుంచి తారు రోడ్లుగా మార్చేందుకు గతంలోనే నిధులు మంజూరయ్యాయి. కానీ ఏళ్లుగా పనులు జరగడం లేదు. ఇప్పుడు వీటిని సైతం పక్షం రోజుల్లోగా పూర్తి చేసేందుకు సంబంధిత గుత్తేదారును ఆదేశించారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ వంశీ తెలిపారు. అన్నీ పూర్తయితే అందరికీ ప్రయాణ సమస్య తీరుతుందన్నారు.


నెల రోజుల్లో పూర్తి చేయిస్తాం

రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు

ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న దారులన్నీ బీటీ వేసి పూర్తి చేయాలని ఆదేశించాం. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. బషీరాబాద్‌ మండలం తోపాటు యాలాల, తాండూరు, పెద్దేముల్‌ మండలాల్లోనూ అన్ని రోడ్లను అద్దంలా మార్చనున్నాం. ఎన్నో ఏళ్లుగా మంజూరు కాని నిధులు ప్రస్తుతం రాబట్టాం. ఎన్నడూ లేని విధంగా పనులు చేయిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని