logo

24/7 ఇక నగరం నిద్రపోదు

నిత్యం ఉరుకులు పరుగుల ప్రపంచం. అందాలు.. ఆనందాలు.. సరదాలు.. విందులు, వినోదాలకు కొదవలేని మహానగరం.

Published : 27 Apr 2023 01:38 IST

ప్రభుత్వ నిర్ణయంతో గ్లోబల్‌ సిటీగా అడుగులు
ఈనాడు, హైదరాబాద్‌

నిత్యం ఉరుకులు పరుగుల ప్రపంచం. అందాలు.. ఆనందాలు.. సరదాలు.. విందులు, వినోదాలకు కొదవలేని మహానగరం. ప్రజల అభిరుచులు, ఆలోచనలకనుగుణంగా ప్రభుత్వం 24 గంటలపాటు దుకాణాలు, హోటళ్లు తెరిచిఉంచేలా అనుమతివ్వటం శుభపరిణామం. తెల్లవారుజామున రైలు దిగే ప్రయాణికుడు.. అర్ధరాత్రి విమానాశ్రయం నుంచి బయటకొచ్చిన విదేశీయుడు.. సామాన్యుడి నుంచి సీఈవోదాకా అన్నీ అందుబాటులో ఉండేలా నగరం మారబోతోంది. పాతబస్తీలో అర్ధరాత్రి తర్వాత కూడా బిర్యానీ ఆరగించేందుకు నగరవాసులు వెళుతుంటారు. ట్యాంక్‌బండ్‌పై ప్రతిరోజూ 12 గంటల సమయంలో పుట్టినరోజు కేక్‌ కట్టింగ్‌ల సందడి అంతాఇంతా కాదు. ఐటీ కారిడార్‌లో ఉద్యోగులు కాలంతో పోటీపడుతూ పనిచేస్తుంటారు. ఇప్పుడు నగరంలో లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలు, చిటుక్కుమంటే తెలిసిపోయే కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఉండటం తాజా నిర్ణయానికి తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.

విశ్వనగరంగా..

పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు, విదేశీ సంస్థలు నగరాన్ని గమ్యస్థానంగా నగరాన్ని ఎంచుకునేందుకు 24/7 నిర్ణయం ఉపకరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మిగతా నగరాలతో పోటీపడి మరిన్ని పెట్టుబడులను రాబట్టేందుకు దోహదం చేస్తుందని అంచనా వేస్తోంది. రెండు దశాబ్దాల క్రితం ఐటీ రాకతో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసే కార్యాలయాలు కాస్తా 24 గంటలు పనిచేయడం మొదలెట్టాయి. దీంతో ఉద్యోగాల కల్పన, ఐటీ ఎగుమతులపరంగా దేశంలోనే మెరుగైన స్థానంలో నగరం ఉంది.

స్ట్రీట్‌ వెండర్లకు అవకాశం: మహా నగరమైనా రాత్రి 11గంటలు దాటితే భోజనం దొరక్క రోడ్లపక్కన బండ్లపై ఆరగించేందుకు రాత్రి ఉద్యోగులు పడేపాట్లు ఎన్నో. సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై చట్టబద్ధంగా స్ట్రీట్‌ వెండర్లు వ్యాపారాలు చేసుకోవచ్చు.


భద్రత పెద్ద సమస్య కాదు

-వెంకటేశ్‌, వ్యవస్థాపకులు, ‘స్వతంత్ర సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఫ్లరిషింగ్‌ ఫౌండేషన్‌’

వీధి వ్యాపారులు జీవనోపాధి పెంచుకునేలా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా విధానపరమైన నిర్ణయాల కోసం మా సంస్థ కృషి చేస్తోంది. 24 గంటలు దుకాణాలు తెరిచిఉంచేందుకు అనుమతి ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయం. భద్రతా అంశాన్ని చాలామంది తెర మీదకు తెస్తున్నారు. వాస్తవానికి రాత్రి నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టే నేరాలకు ఆస్కారముంటుంది. రాత్రి కూడా జనసంచారం పెరిగితే నేరస్థులు భయపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని