logo

ఉపాధి కూలీలకు పరికరాల పంపిణీ

ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిదేళ్ల క్రితం సామగ్రి ఇవ్వగా.. ఆ తరువాత మానేసింది.

Published : 08 Jun 2023 00:48 IST

పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయం

న్యూస్‌టుడే, బషీరాబాద్‌: ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిదేళ్ల క్రితం సామగ్రి ఇవ్వగా.. ఆ తరువాత మానేసింది. కొత్తగా నమోదైన కూలీలు సొంతంగానే పరికరాలు తెచ్చుకొని పనులు చేసుకునేవారు. తాజాగా కూలీల సంఖ్య పెరగడంతో ఉపాధి సిబ్బంది, కూలీల విన్నపం మేరకు వారికి అనువైన పలుగు, పార, గంప, గొడ్డలి, ఇతర పరికరాలు, ప్రథమ చికిత్సకు అవసరమైన సామగ్రి కిట్‌ను అందించనున్నారు.

2 లక్షల మందికి మేలు: జిల్లాలో వ్యవసాయం, ఉపాధి కూలీపైనే ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు అత్యధికంగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,99,491 జాబ్‌కార్డులు ఉండగా, 4.35లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. వీరిలో ప్రతి ఏడాది వేసవిలో సరాసరిగా 1.50లక్షల నుంచి 2లక్షల మంది కూలీలు నిత్యం పనులకు వచ్చి వ్యవసాయ అనుబంధ పనులు, చెరువుమట్టి తీయడం, కంచె తొలగించడం, పేదల భూములు చదును చేయడం, మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం వంటి పనులు చేసేవారు. సాధారణ రోజుల్లో 4-5వేల మంది కూలీలు ఆయా గ్రామాల్లో నర్సరీల్లో పనులు, మొక్కలకు నీరు పోయడం, పంచాయతీల్లో అవసరమైన పనులకు కూలీలు పని చేస్తున్నారు. వీరికి అవసరమైన పరికరాలు లేక ఇబ్బంది పడేవారు. కొందరు సొంతంగా నగదు పెట్టి కొనుగోలు చేసుకునే వారు. అనువైన పరికరాలు లేక ఇబ్బందులు పడే వారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో నిత్యం పనులకు వచ్చే సుమారు 2లక్షల మంది కూలీలకు పలుగు, పార, గొడ్డలి, గంప, ఇతర పరికరాలు అందనున్నాయి. తద్వారా వారికి ఆర్థిక భారం తీరనుంది.

రూ.కోట్లలో ఖర్చు..: గతంలో ఉపాధి కూలీలకు కేవలం పలుగు (గునపం) మాత్రమే పంపిణీ చేశారు. ప్రస్తుతం పలుగు, పార, గొడ్డలి ఇతర సామగ్రి పంపిణీ చేయనుండడంతో కనీసం ఒక కూలీకి రూ.1,000ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈలెక్కన సుమారు రూ.20కోట్ల మేరకు వెచ్చించనున్నారు. ఉపాధి పథకం కేంద్రానికి చెందినదైనా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే సామగ్రిని అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని