logo

వ్యూహాలు.. పథకాలు

రాబోయే శాసనసభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని రాజధాని పరిధిలో మూడొంతుల స్థానాలను దక్కించుకోవడానికి అధికార భారాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Updated : 23 Aug 2023 04:38 IST

భారీ ప్రణాళికలతో అడుగులేస్తున్న భారాస
రాజధానిలో మూడొంతుల స్థానాలు లక్ష్యం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ఎన్నికలయ్యే వరకు వివాదాల జోలికెళ్లొద్దు.. పూర్తిగా జనంతోనే మమేకమై ఉండండి.. నిత్యం మీ నియోజకవర్గాల్లో పర్యటించండి.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి.. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందిద్దాం..

- సీట్లు ఖరారైన అభ్యర్థులకు భారాస దిశానిర్దేశం

రాబోయే శాసనసభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని రాజధాని పరిధిలో మూడొంతుల స్థానాలను దక్కించుకోవడానికి అధికార భారాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 29 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. వారంతా ఈ 3 నెలలు ప్రజల మధ్యే ఉండేలా.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రతి అభ్యర్థితోనూ పార్టీ సీనియర్‌ నాయకులు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. బుధవారం నుంచి అభ్యర్థులంతా పూర్తిగా జనంలో ఉండేలా ప్రణాళికను అమలులోకి తేబోతున్నారు. కాంగ్రెస్‌, భాజపాలు తమ అభ్యర్థులను ప్రకటించే సమయానికి నగరంలోని అన్ని డివిజన్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పర్యటించేలా కసరత్తు చేయబోతున్నారు. అదే సమయంలో లబ్ధిదారులకు పథకాలు అందేలా ప్రణాళిక రచిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ 29 స్థానాలకుగాను 19 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. అప్పట్లో మహేశ్వరం, ఎల్బీనగర్‌ నుంచి గెల్చిన సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచి అధికార పార్టీలోకి వచ్చారు. ఎంఐఎం 7 స్థానాలను, గోషామహల్‌ను రాజాసింగ్‌ (భాజపా) కైవసం చేసుకున్నారు. ఈసారి ఎంఐఎం మినహా కాంగ్రెస్‌, భాజపా స్థానాల్లో కూడా విజయం సాధించాలన్న లక్ష్యాన్ని భారాస పెట్టుకుంది. దీనికోసమే బలమైన అభ్యర్థి కోసం ఈ స్థానంలో ఎవరినీ ప్రకటించకుండా వదిలేసింది.


వరాలిలా..

బుధ, గురువారాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఒక్కో నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ నెలాఖరున లేదా వచ్చేనెల మొదటివారంలో 70,000 రెండు పడక గల ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలకపాత్ర పోషిస్తున్నారు.


ప్రచారం షురూ

మరోవైపు టిక్కెట్లు పొందిన ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్‌, వివేకానంద్‌, మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్‌ తదితరులు మంగళవారం నుంచి అధికారికంగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మిగిలినవారు కూడా ఇదే బాటలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్లు ఖరారు కావడంతో సంబంధిత అభ్యర్థుల ఇళ్ల వద్ద సందడి నెలకొంది. కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యేలను అభినందనలతో ముంచెత్తారు.


నేడు, రేపు బీసీ కులవృత్తులకు రూ. లక్ష సాయం

-మంత్రి తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం అందించే రూ.లక్ష సాయాన్ని బుధవారం, గురువారం అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మొదటి దశ కింద నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. సనత్‌నగర్‌, జూబ్లిహిల్స్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసి అందిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని