logo

Hyderabad: వేటు వేస్తున్నా... రూటు మారలె!

తప్పతాగి వాహనాలు నడుపుతున్న వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెన్షన్‌ చేస్తున్నా సరే...వారి రూటు మారడం లేదు. గత ఏడాది గ్రేటర్‌ వ్యాప్తంగా 10,258 డ్రైవింగ్‌ లైసెన్సులపై రవాణాశాఖ వేటు వేసింది.

Updated : 02 Mar 2024 08:54 IST

 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిన వారి లైసెన్సులు సస్పెన్షన్‌ 
ఏడాదిలో 6395 రద్దు   

ఈనాడు, హైదరాబాద్‌: తప్పతాగి వాహనాలు నడుపుతున్న వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెన్షన్‌ చేస్తున్నా సరే...వారి రూటు మారడం లేదు. గత ఏడాది గ్రేటర్‌ వ్యాప్తంగా 10,258 డ్రైవింగ్‌ లైసెన్సులపై రవాణాశాఖ వేటు వేసింది. ఇందులో కేవలం 6395 లైసెన్సులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులకు సంబంధించినవే ఉన్నాయి. కనీసం మూడు నెలల నుంచి గరిష్ఠంగా 6 నెలల వరకు ఈ లైసెన్సులను సస్పెన్షన్‌లో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత షోకాజ్‌ నోటీసు జారీ చేసి వివరణ కోరుతున్నారు. అయినా చాలామంది వాహనదారుల తీరులో మార్పు కన్పించడం లేదు. లైసెన్సులపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేసిన తర్వాత మళ్లీ మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తూ దొరికిన వారు ఉంటున్నారని పేర్కొంటున్నారు. కొందరైతే లైసెన్సు రద్దు చేసిన తర్వాత కూడా డ్రైవింగ్‌ చేస్తున్నారు. లైసెన్సు సస్పెన్షన్‌లో ఉంటే...అలాంటి వ్యక్తులు వాహనాలు నడిపేందుకు అనర్హులు. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి అవతవల వ్యక్తికి ప్రాణాపాయం తలెత్తితే తీవ్ర నేరంగా చట్టం పరిగణిస్తుంది. అయినా సరే...చాలామంది డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. యువత భవిష్యత్తులో ఉద్యోగాలు, ఇతర పనులకు విదేశాలకు వెళ్లే వారు ఎక్కువే. విదేశాల్లో డ్రైవింగ్‌ చేయాలంటే అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సు తప్పనిసరి. ఏదైనా కారణంతో ఒక్కసారి లైసెన్సు సస్పెన్షన్‌కు గురైతే...ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు జారీ కష్టతరంగా మారుతుంది. అదే జరిగితే విదేశాలకు వెళ్లినా అక్కడ వాహనాలను నడపలేరు. ఒకవేళ లైసెన్సు లేకుండా విదేశాల్లో డ్రైవ్‌ చేస్తే...భారీ శిక్షతోపాటు జరిమానాలు ఉంటాయి. గతేడాదిలో రహదారి ప్రమాదాలకు కారణమైన 384 మంది వాహనదారుల లైసెన్సులను సస్పెన్షన్‌లో పెట్టింది. మొబైల్‌ ఫోన్లు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తున్న వారు నిత్యం రోడ్లపై కన్పిస్తుంటారు. కేసులు మాత్రం తక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ నేరంతో ఏడాదిలో కేవలం 10 మంది లైసెన్సులను ఆర్టీఏ సస్పెన్షన్‌ చేసిందని హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ రమేష్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని