logo

బాలల దాహార్తి తీరేదెలా?

వ్యవసాయ ఆధారిత జిల్లాలో రైతు కుటుంబాలే ఎక్కువ కావడంతో అధికశాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు.

Published : 27 Mar 2024 01:20 IST

నిర్వహణ లోపంతో పాఠశాలకు చేరని భగీరథ జలాలు
ఇంటినుంచి తెచ్చుకున్నా సరిపోని వైనం
న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, తాండూరు గ్రామీణ, తాండూరు టౌన్‌, పరిగి, మోమిన్‌పేట, ధారూర్‌, దోమ

వ్యవసాయ ఆధారిత జిల్లాలో రైతు కుటుంబాలే ఎక్కువ కావడంతో అధికశాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. తాగు నీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం 90 శాతం పాఠశాలల్లో ‘మిషన్‌ భగీరథ’ వసతి కల్పించింది. ఎండా కాలం నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, విద్యార్థుల ఇక్కట్లు తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ మంగళవారం ‘పరిశీలన’ చేపట్టింది. ఈ సందర్భంగా నిర్వహణ లోపంతో సగానికి పైగా పాఠశాల్లో భగీరథ నీటి సరఫరా లేదని వెల్లడైంది. అనేక చోట్ల విద్యార్థులు ఇంటినుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. ఇదికూడా సరిపోక అవస్థలు పడుతున్నారు.  

20 లీటర్ల క్యాన్లు కొంటున్నారు

బొంరాస్‌పేట మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలకు భగీరథ నీటి సరఫరా లేదు. దుద్యాల మండలంలోని చిల్ముల్‌మైలారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉదయం పూటే భగీరథ సరఫరా కావడంతో వంట చేయడానికి ఏజన్సీ మహిళలు వినియోగిస్తున్నారు. గ్రామంలోని శుద్ధ జలం ప్లాంట్‌ నుంచి ఐదు రూపాయలకు 20 లీటర్ల క్యాన్లు రోజుకు మూడు కొనుగోలు చేస్తున్నారు.

కనుమరుగైన గొట్టాలు..

తాండూరు మండలం చెంగోల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భగీరథ గొట్టాలు అమర్చారు. నెలరోజులకే దెబ్బతిన్నాయి. ఆ తర్వాత గొట్టాలు కన్పించకుండాపోయాయి. దీంతో భగీరథ నిలిచిపోయింది. శుద్ధి నీటి ప్లాంటు సైతం మరమ్మతులకు గురవడంతో రెండేళ్లుగా నిరుపయోగమైంది.

తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నంబర్‌ వన్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని సాధారణ ట్యాంకు నుంచి బోరు నీటినే తాగాల్సి వస్తోంది. మల్‌రెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్యాంకు నీటిని లేదా ఇంటి నుంచి తెచ్చుకుంటున్న నీటినే తాగుతున్నారు.  

విన్నవించినా పట్టించుకోవడంలేదు

ధారూర్‌ మండల పరిధిలోని పీసీయం తండా ప్రాథమిక పాఠశాలో  బోరు మోటారు మరమ్మతుకు చేరింది. దీంతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా పైపులైను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన పట్టించుకోవడం లేదు.


స్వచ్ఛంద సంస్థల సాయం..  

వికారాబాద్‌ జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల కోసం  ఏడాది క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ నీటి ఫిల్టర్‌ యంత్రాన్ని పాఠశాలకు అందజేసింది. ప్రాథమిక పాఠశాలలో మట్టి కుండలు ఏర్పాటు చేశారు. జడ్పీ పాఠశాల విద్యార్థులు బోరునీరు తాగుతున్నారు.

  • మోమిన్‌పేట మండల పరిధిలోని దుర్గం చెరువు పాఠశాలలో రోజుకు బిందె నీళ్లను పాఠశాల ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. మోమిన్‌పేట బాలుర ఉన్నత పాఠశాలలో బోరు బావి నీళ్లే ఆధారం.
  • కొడంగల్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత, బాలికల ఉన్నత, కస్తూర్బా పాఠశాల, కళాశాలల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా బాగుంది.
  • పూడూరు మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాలకు భగీరథ నీటి సరఫరా లేదు. దీంతో పక్కనే ఉన్న ఉన్నత పాఠశాల ఆవరణలోని సింగిల్‌ ఫేస్‌ బోరునుంచి ప్లాస్టిక్‌ పైప్‌లైన్‌ అమర్చి వంట పాత్రల్లో నీటిని నింపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని