logo

హుందాగా వ్యవహరించా.. ప్రజల గౌరవం పెంచా: కిషన్‌రెడ్డి

‘సికింద్రాబాద్‌ ఎంపీగా నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచేందుకు ప్రయత్నించానే తప్ప ఏనాడు తలవంపులు తెచ్చే ఏ పని చేయలేదు. దూషణలకు దిగకుండా హుందాగా వ్యవహరించాను.

Published : 27 Mar 2024 01:23 IST

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: ‘సికింద్రాబాద్‌ ఎంపీగా నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచేందుకు ప్రయత్నించానే తప్ప ఏనాడు తలవంపులు తెచ్చే ఏ పని చేయలేదు. దూషణలకు దిగకుండా హుందాగా వ్యవహరించాను. మరోసారి అవకాశం ఇస్తే  ప్రజలు గర్వపడే విధంగా పని చేసి వారి మెప్పు పొందేందుకు కృషి చేస్తానని’ కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు.   పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400 సీట్లు ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.గౌతంరావు, నల్లకుంట కార్పొరేటర్‌ అమృతతో కలిసి మంగళవారం బర్కత్‌పురలోని రత్నానగర్‌, సత్యానగర్‌ బస్తీల్లో ఆయన పర్యటించారు. స్థానిక ప్రముఖులను కలిసి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. భాజపా అంబర్‌పేట నియోజకవర్గ కన్వీనర్‌ ఎం.శ్యామ్‌రాజ్‌, పి.ఈశ్వర్‌, ఎం.శ్రీకాంత్‌, క్రాంతి, లక్ష్మణ్‌, రత్నానగర్‌, సత్యానగర్‌ బస్తీ సంఘాల అధ్యక్షులు ఎంబీ కిశోర్‌, రాంచందర్‌ పాల్గొన్నారు.

ఓబీసీలు క్రియాశీలక పాత్ర పోషించాలి.. రాష్ట్రంలో భాజపా అత్యధిక పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవడంలో ఓబీసీలు క్రియాశీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు.   బర్కత్‌పురలోని పార్టీ నగర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆనంద్‌గౌడ్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మోర్చా సమావేశంలో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌ఛార్జి రాధేశ్యాం, నాయకులు నందనం దివాకర్‌, ఈశ్వరప్ప, సంజయ్‌ ఘనాతే, మహేశ్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు.


భారాస ఖాళీ కావడం ఖాయం..

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: దేశంలో చిన్నాచితక పార్టీలతో ఏర్పడిన కూటమి ప్రధాని మోదీని ఢీకొట్టలేదని.. దేశ ప్రజలకు భరోసా, భద్రత కల్పించే సత్తా మోదీకే ఉందని భాజపా సికింద్రాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భాజపా ఒంటరిగా 370 సీట్లు, మిత్ర పక్షాలతో కలిసి 400 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ 2019 ఎన్నికల్లో సాధించిన సీట్ల మార్కును కూడా దాటదని జోస్యం చెప్పారు. ఆసిఫ్‌నగర్‌లోని యాదవబస్తీ, కుమ్మరివాడల్లో స్థానిక పెద్దలతో ఆయన మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. దేశంలో 80శాతం రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉండగా, కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. భారాస ఖాళీ కానుందని, కేసీఆర్‌ ఇక ఫాంహౌజ్‌కే పరిమితమవుతారన్నారు. విజయనగర్‌కాలనీ డివిజన్‌ అధ్యక్షుడు డి.ఆనంద్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో పార్టీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డా.గౌతంరావు, అధికార ప్రతినిధి అన్నపురం రమేష్‌కుమార్‌, నేతలు రాహుల్‌చంద్ర, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని