logo

లీగల్‌ మెట్రాలజీ అధికారుల చేతివాటం

ఉదయం లేవగానే వినియోగించే టూత్‌ పేస్ట్‌ నుంచి రాత్రి పడుకునే ముందు వాడే బెడ్‌ షీట్‌ వరకు ప్రతి వస్తువుపై తూకం, ఎమ్మార్పీ, ప్యాకేజింగ్‌, కొలతలను నిక్కచ్చిగా పరిశీలించే లీగల్‌ మెట్రాలజీ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది.

Published : 27 Mar 2024 01:33 IST

స్టాంపింగ్‌ కోసం అడిగినంత ఇవ్వాల్సిందే

ఈనాడు, హైదరాబాద్‌: ఉదయం లేవగానే వినియోగించే టూత్‌ పేస్ట్‌ నుంచి రాత్రి పడుకునే ముందు వాడే బెడ్‌ షీట్‌ వరకు ప్రతి వస్తువుపై తూకం, ఎమ్మార్పీ, ప్యాకేజింగ్‌, కొలతలను నిక్కచ్చిగా పరిశీలించే లీగల్‌ మెట్రాలజీ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోంది. కోటిన్నర జనాభా ఉన్న రాజధానిలో ఈ విభాగంలో 30 మందికి మించి అధికారులు లేరు. స్టాంపింగ్‌, వ్యాలిడిటీ సర్టిఫికేట్ల జారీకి కొందరు అధికారులు భారీగా లంచాలు డిమాండ్‌ చేస్తున్నారు. 25 తూకం యంత్రాల స్టాంపింగ్‌కు రూ.10 వేలు డిమాండ్‌ చేసిన ఓ అధికారిణిని అనిశా ఇటీవల రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పెట్రోల్‌ బంకులు, వేబ్రిడ్జ్‌లు, ఎల్పీజీ, జ్యువెల్లరీ, ఫార్మా, రైస్‌, ఆయిల్‌ మిల్లులు, టింబర్‌, లిక్కర్‌, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసం దుకాణాలు, పండ్లు, టెక్స్‌టైల్స్‌, రెడిమేడ్‌ గార్మెంట్స్‌, వీక్లీ బజార్లు, స్టీల్‌ ట్రేడర్లు, పాన్‌ బ్రోకర్లు, ఎరువులు, పురుగుల మందులు.. ఇలా మొత్తం 43 విభాగాల్లోని కాంటాలపై ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. తూనికల కొలతల శాఖ చట్టం సెక్షన్‌ 23 ప్రకారం ఎలక్ట్రానిక్‌ కాంటాను ఉపయోగించే వారు కచ్చితంగా ఏటా వెరిఫికేషన్‌ చేయించుకోవాలి. ఇదే అదనుగా అధికారులు వ్యాలిడిటీ సర్టిఫికేట్లు, స్టాంపింగ్‌ చేసేందుకు ఇష్టానుసారం లంచాలు డిమాండ్‌ చేస్తున్నారు. రాజధాని పరిధిలో ఆయా విభాగాల నుంచి మొత్తం 350 దరఖాస్తులు వస్తుండగా, వీటిని జారీ చేసేందుకు కొందరు అధికారులు భారీ స్థాయిలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ నిర్వాకం.. పెద్దఎత్తున స్టాంపింగ్‌ కోసం వచ్చే కొన్ని పరిశ్రమల ప్రతినిధులు, కన్సల్టెంట్లు రాగానే కొందరు అధికారులు బేరసారాలకు దిగుతున్నారు. ఒక్కో యంత్రానికి ఇంత ఇవ్వాల్సిందేనంటున్నారు. డబ్బు ఇవ్వని వారికి ఏవో కొర్రీలు చూపుతూ తిప్పించుకుంటున్నారు. విసిగిన ఏజెంట్లు అదే ధర ఇచ్చేందుకు ముందుకు రాగానే ఫలానా చోటుకి వస్తే మా అసిస్టెంట్‌ డబ్బులు తీసుకుంటారంటూ గూగుల్‌ మ్యాప్‌ లొకేషన్లు పంపిస్తున్నారు. ఇంకొందరు అధికారులు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వాట్సాప్‌ కాల్‌ చేస్తేనే మాట్లాడతామని.. సూచిస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు, అవినీతి నిరోధక శాఖ నిఘా పెట్టాలంటూ వ్యాపార, పరిశ్రమల వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని