logo

డ్రోన్లతో మూసీ సర్వే

మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్‌) దృష్టి సారించింది. నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు.

Published : 27 Mar 2024 01:58 IST

రెండువైపులా 2 కి.మీ. మేర  ఆక్రమణల గుర్తింపునకు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్‌) దృష్టి సారించింది. నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు. ఎఫ్‌టీఎల్‌తోపాటు బఫర్‌జోన్‌లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేస్తారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఎస్‌ఐ)తో అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పునరావాసంపై ఈ సర్వేతో స్పష్టత రానుంది. తొలుత హైడ్రోలాజికల్‌ సర్వే చేశారు. ఫలితంగా వానాకాలంలో మూసీలోకి వచ్చే వరద ఎంత.. ఎక్కడి వరకు వరద రానుందో అంచనాకు వచ్చారు. 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు.. ప్రస్తుతం వస్తున్న మురుగు జలాలు.. వాటి శుద్ధి తదితర విషయాలపై ఈ సర్వేతో ఒక అంచనాకు వచ్చారు. తాజాగా రెండు రోజుల నుంచి అధికారులు డ్రోన్‌ సర్వే ప్రారంభించారు.

ఎన్నికల తర్వాత డీపీఆర్‌ పనులు మొదలు..

మూసీ అభివృద్ధి ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్‌) కోసం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెండర్లు పిలిచారు. ఎన్నికల తర్వాత పనులు మొదలుపెట్టనున్నారు. మూసీ ప్రక్షాళన,  సుందరీకరణ దశల వారీగా 12-15 రకాల పనులను చేపట్టనున్నారు. ఆక్రమణల తొలగింపు, రెండువైపులా రహదారులు, పార్కులు,  వ్యాపార కేంద్రాల ఏర్పాటు, షాపింగ్‌ మాల్స్‌ కూడా నిర్మించాల్సి ఉంటుంది. మూసీలో మురుగు కలవకుండా రెండు వైపులా సీవరేజ్‌ ట్రంక్‌ మెయిన్‌.. వాటికి అనుసంధానంగా క్లోరినేషన్‌ యూనిట్లు కూడా రానున్నాయి. కొత్వాల్‌గూడ ఎకో పార్కును కూడా మూసీ ప్రాజెక్టు కిందకు తీసుకురానున్నారు. గత ప్రభుత్వ హాయంలో రూ.150 కోట్లతో ఈ ఏకో పార్కు పనులు ప్రారంభించగా మధ్యలో ఆగిపోయాయి. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభించనున్నట్లు ఓ అధికారి వివరించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని