logo

అన్నీ కలిపి.. ఒక్కటే!

రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్‌ప్లాన్‌ తయారీకి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్‌ప్లాన్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Updated : 28 Mar 2024 09:12 IST

2050 వైబ్రెంట్‌ మాస్టర్‌ప్లాన్‌కు హెచ్‌ఎండీఏ కసరత్తు
తాజాగా ఈడీపీ, సీఎంపీలతో అనుసంధానం

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్‌ప్లాన్‌ తయారీకి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్‌ప్లాన్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. గతంలోని ఐదు మాస్టర్‌ప్లాన్‌లతోపాటు ఇటీవల రూపొందిస్తున్న మరో రెండు ప్రణాళికలను వచ్చే మాస్టర్‌ప్లాన్‌లో అనుసంధానం చేయనున్నారు. గతేడాది ఆర్థికపరమైన, ప్రజారవాణాకు సంబంధించి రెండు కీలక ప్రణాళికలు తయారీ హెచ్‌ఎండీఏ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎకనామిక్‌ డెలప్‌మెంట్‌ ప్లాన్‌(ఈడీపీ), కాంప్రెన్సివ్‌ మొబెలిటీ ప్లాన్‌(సీఎంపీ)లకు కన్సల్టెంట్లను నియమించింది. తాజాగా ఈ రెండు ప్రణాళికను కూడా రానున్న మహా మాస్టర్‌ప్లాన్‌లో అనుసంధానం చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఈడీపీలో ఇలా..

  • ఎకనామిక్‌ డెలప్‌మెంట్‌ ప్లాన్‌లో భాగంగా ఒక సమగ్ర నివేదికకు రూపకల్పన చేయనున్నారు. వచ్చే 30ఏళ్లలో హైదరాబాద్‌ మెట్రోప్లాన్‌ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి కోసం పక్కా ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రపంచంలో టాప్‌-10 గ్లోబల్‌ నగరాల సరసన హైదరాబాద్‌ చేరాలంటే ఎలాంటి వ్యుహం అనుసరించాలనేది ఇందులో కీలకాంశం.
  • హెచ్‌ఎండీఏ పరిధిలోని ఆర్థిక పరిస్థితులకుతోడు ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ దూరదృష్టి ఎలా ఉండాలి.. ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి.. ఏ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి.. అనే అంశాలు పొందుపర్చనున్నారు.
  • పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక వసతులు, పెట్టుబడుల కోసం కుదుర్చుకునే ఒప్పందాలు, పరిశ్రమల స్థాపన, స్థానిక ఎకనామిక్‌ సెక్టార్లపై దృష్టి, సరైన పెట్టుబడి విధానాలు ఇత్యాది అంశాలను ఈ ప్లాన్‌లో చర్చించనున్నారు. అనంతరం ఈ ప్రణాళిక అమలుకు తగిన చర్యలు తీసుకోనున్నారు.

సీఎంపీలో ఇలా..

  • ఏ నగరంలోనైనా ప్రజా రవాణా అత్యంత కీలకం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాకు పక్కా ప్రణాళిక ముఖ్యం. హెచ్‌ఎండీఏ రూపొందించనున్న కాంప్రెన్సిన్‌ మొబెలిటీ ప్లాన్‌(సీఎంపీ) ప్రధానంగా దీనిపై దృష్టి సారించనుంది.
  • ఇప్పటికే గ్రేటర్‌వ్యాప్తంగా 80 లక్షలు వాహనాలు తిరుగుతున్నాయి. నిత్యం 3వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్‌ జాం అవుతోంది. భవిష్యత్తులో మరింత జనాభా పెరగనున్న దృష్ట్యా సమగ్రమైన ప్రణాళిక తప్పనిసరి.
  • ముఖ్యంగా వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించి ప్రజా రవాణా ఎక్కువగా ఉపయోగించుకునేలా దృష్టి సారించాల్సిన అవసరముంది. లేదంటే దిల్లీ మాదిరిగా నగరం కాలుష్య కాసారంగా మారే ప్రమాదం ఎంతో దూరంలో లేదు.
  • జాతీయ పట్టణ రవాణా పాలసీ(ఎన్‌యూటీపీ)కు అనుగుణంగా ప్రజలకు ఉపయోగకరంగా, వారికి సౌకర్యవంతంగా, భరించేస్థాయిలో ఉండేలా దీర్ఘకాల రవాణా వ్యుహాలపై ఈ సీఎంపీ దృష్టిసారించనుంది. ఇందులో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌లను కూడా భాగస్వామ్యం చేయనున్నారు.
  • 2050 నాటి అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సక్రమంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాజెక్టులపై కూడా సీఎంపీ దృష్టి సారించనుంది. విలువైన సూచనలు, సలహాలు అందించనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని