logo

మూలికా వనం.. కబ్జాల పరం

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో ప్రారంభించిన మూలికా వనం(హెర్బల్‌ గార్డెన్‌)ను ఆక్రమించేందుకు కొందరు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ వనంలో పదుల సంఖ్యలోనే మొక్కలుండగా, వాటి సంరక్షణనూ మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.

Published : 29 Mar 2024 03:49 IST

జవహర్‌నగర్‌లో నాలుగెకరాల్లో ఉద్యానం
ఇనుప కంచెలు, బోర్డు తొలగింపు..

జవహర్‌నగర్‌లోని హెర్బల్‌ గార్డెన్‌ సూచిక బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌, జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే : జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో ప్రారంభించిన మూలికా వనం(హెర్బల్‌ గార్డెన్‌)ను ఆక్రమించేందుకు కొందరు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ వనంలో పదుల సంఖ్యలోనే మొక్కలుండగా, వాటి సంరక్షణనూ మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా.. మూలికావనం ఇనుప కంచెను, బోర్డును ఇటీవల కొందరు తొలగించారు. కొంచెంకొంచెంగా ఆక్రమించేందుకు  సమీపంలోని ప్రైవేటు పట్టాల హద్దులను పెంచుకుంటూ స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు..: జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే జీహెచ్‌ఎంసీ డంపింగ్‌ యార్డ్‌ ఉండటంతో అందులో నుంచి విడుదలయ్యే కలుషిత వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రకృతి వనం పేరుతో గత ప్రభుత్వం నాలుగేళ్ల కిందట  కాప్రా మండలంలోని సర్వే నంబర్లు 759, 974లలో 4.03 ఎకరాల్లో మూలికల మొక్కలు పెంచాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించింది. స్థలం కేటాయింపు తర్వాత మున్సిపల్‌ అధికారులు కంచెలు ఏర్పాటుచేసుకున్నారు. అటవీశాఖ నుంచి ఔషధ మొక్కలు తీసుకుని నాటారు. మాజీ మంత్రి మల్లారెడ్డి హెర్బల్‌ పార్కును ప్రారంభించారు.

నిర్వహణ లోపం.. అక్రమార్కులకు వరం

కొద్దినెలలు మున్సిపల్‌ అధికారులు హడావుడి చేశారు. కొన్ని మొక్కలు తీసుకువచ్చి బాగానే సంరక్షించారు. కరోనా ప్రభావంతో పట్టించుకోవడం మానేశారు. కరోనా పూర్తిగా తొలగినా కొత్తగా మొక్కలు నాటలేదు. ఉన్నవాటి నిర్వహణా వదిలేశారు. హైదరాబాద్‌ బిట్స్‌ క్యాంపస్‌కు వెళ్లే మార్గంలో ఈ వనం ఉండటం, ఇక్కడ ఎకరా రూ.2కోట్ల వరకు పలుకుతుండటంతో కొందరు కబ్జాదారులు  తెర వెనుక ఉండి సరిహద్దు కంచె, బోర్డును తీసేయించారు. ఇప్పుడీ ప్రాంతం మైదానంలా మారడంతో క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ ఆడుతున్నారు. ఇనుప కంచెను, బోర్డును తొలగించినా అధికారులు ఇప్పటికీ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని