logo

తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం

తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది.  అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు.

Updated : 23 Apr 2024 05:21 IST

అవస్థల మధ్య గని కార్మికులు 

నేలపై కూర్చొని భోజనం చేస్తున్న కార్మికులు

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది.  అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. వీరికి మాత్రం కనీస సౌకర్యాలు కొరవడి అవస్థల మధ్య కాలం నెట్టుకు రావాల్సి వస్తోంది. తనిఖీలు చేపట్టక, అధికారుల చూసీ చూడనట్లు వ్యవహరించడమే ఇందుకు కారణమని పలువురు విమర్శిస్తున్నారు.

300 గనులు, 5000 మంది..

తాండూరు మండలం మల్కాపూర్‌, సంగెంకలాన్‌, కొత్లాపూర్‌, ఓగీపూర్‌, కరణ్‌కోట, కోటబాస్పల్లి, ఉద్దండాపూర్‌ పరిధిలో 300లకుపైగా నాపరాయి గనులు కొనసాగుతున్నాయి. వీటిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు విడతల వారీగా 5వేలమందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. నాపరాయిని కొలతల ప్రకారం కోత విధించడం, దాన్ని పారలతో వెలికితీయడం, తిరిగి లారీల్లో నింపి తరలించే పనుల్లో పాల్గొంటున్నారు. గనుల్లో 8 గంటల నుంచి పది గంటలపాటు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో కార్మికులకు తాగునీరు, భోజనం చేసేందుకు ఎలాంటి గదులు నిర్మించలేదు. దీంతో వెంట తెచ్చుకున్న భోజనాన్ని పని ప్రదేశంలో అపరిశుభ్రమైన పరిసరాల్లో తినాల్సి వస్తోంది. పెద్దపెద్ద బండరాళ్ల వద్ద ప్రమాదకర ప్రదేశాల్లో భోజనం చేస్తుండటంతో ముప్పు పొంచి ఉన్నా పట్టించుకునే వారు లేరు. అపరిశుభ్రత వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు.  

ఏడాదికోసారైనా సందర్శించని అధికారులు

గనుల వద్ద సౌకర్యాలపై కార్మిక శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏడాదికోసారైనా సందర్శించి కార్మికుల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు. విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కార్మికులకు బూట్లు, చేతులకు తొడుగులు అందించాల్సి ఉన్నా గనుల నిర్వాహకులు, యజమానులు పట్టించుకోవడం లేదు. దీంతో గనుల్లో నేలపై అమర్చుతున్న విద్యుత్‌ తీగలు, ఫ్యూజులతో కార్మికులు గతంలో ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఆరు నెలలకు ఒకసారి పాదరక్షలు, తొడుగులు పంపిణీ చేయిస్తే కార్మికులకు ప్రమాదాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కార్మికులు భోజనం చేసేందుకు గదులు, తాగునీటి సౌకర్యాలను అందుబాట్లోకి తేవాలని పలువురు కోరుతున్నారు. అధికారులు గనుల వద్ద పరిశీలించి కార్మికులకు సదుపాయాలు కల్పించేందుకు గనుల నిర్వాహకులను ఆదేశించాలని కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని