logo

మా పార్టీకి ప్రత్యర్థులే లేరు

‘‘హైదరాబాద్‌లో సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాం. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. కొవిడ్‌ సమయంలో అన్నార్తులను అదుకున్నాం. నిస్సహాయులకు అండగా నిలబడ్డాం. మా ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలందించాం. అందుకే మాకు ఓటువేయాలని అడుగుతున్నాం’’

Updated : 06 May 2024 05:38 IST

ఎంఐఎం హైదరాబాద్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ
ఈనాడు, హైదరాబాద్‌

‘‘హైదరాబాద్‌లో సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాం. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. కొవిడ్‌ సమయంలో అన్నార్తులను అదుకున్నాం. నిస్సహాయులకు అండగా నిలబడ్డాం. మా ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలందించాం. అందుకే మాకు ఓటువేయాలని అడుగుతున్నాం’’ అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఐదోసారి ఎంపీగా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో సమస్యలు, మైట్రోరైల్‌, ఐటీ పరిశ్రమల స్థాపన వంటి అంశాలపై ‘ఈనాడు’తో మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో ఏయే అంశాలు గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయి?

లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ముస్లిం రిజర్వేషన్ల అంశం, ఉమ్మడి పౌరస్మృతి, రాజ్యాంగంపై భాజపా వ్యాఖ్యలు, ఇండియా కూటమిలో అనైక్యత, నాయకుల మధ్య విభేదాలు ఓటర్లపై ప్రభావం చూపించనున్నాయి. ఇవే గెలుపోటములను నిర్ణయిస్తాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో మజ్లిస్‌ పార్టీపై అభిమానం, ఇతర పార్టీ అభ్యర్థుల గుణగణాలు, వారి నేపథ్యం ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. జాతీయ అంశాలు కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తాయి.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు.. వారి బలహీనతలు ఏమనుకుంటున్నారు..?

ఈ ఎన్నికలే కాదు... పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మాకు ప్రత్యర్థులే లేరు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. నాతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటాం. కులమతాలకతీతంగా అక్కడికి వచ్చిన వారితో మాట్లాడతాం. వారి ఆవేదనను సావధానంగా వింటాం. సాధ్యమైనంత వేగంగా వారి ఇబ్బందులు తీర్చుతున్నాం.

పాతబస్తీలో మెట్రోరైలు ఏర్పాటుకు మీరు అడ్డుగా ఉన్నారని, అందుకే ఆలస్యమైందని మీ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.. నిజమేనా?

మెట్రోరైలు ప్రాజెక్టుకు కొన్ని సున్నితమైన అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిని అధిగమిచేందుకు కొంత సమయం పట్టింది అంతే. పాతబస్తీలో అభివృద్ధిని మేం అడ్డుకుంటే చార్మినార్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రహదారుల విస్తరణ, పలు ప్రాంతాల్లో నాలాల అభివృద్ధి జరిగేది కాదు. మెట్రోరైలు ఒకటే కాదు.. ఐటీ, ఇతర పరిశ్రమల స్థాపనకు పాతబస్తీ అనువుగా మారుతోంది.

దశాబ్దాలుగా చార్మినార్‌ పాదచారుల అభివృద్ధి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. దీనిపై మీ వైఖరి ఏంటి?

చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు మొదట్లో కొంత మందకొడిగా కొనసాగినా.. తర్వాత వేగం పుంజుకుంది. త్వరలో పూర్తిచేసేందుకు అధికారులతో చర్చించనున్నాం.

చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహుదూర్‌పుర నియోజకవర్గాల్లో ప్రజలు ఇరుకు రహదారులు, పారిశుద్ధ్య సమస్యలు, మూసీ మురుగు కంపుతో ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఎంపీగా మీరేం చర్యలు చేపట్టారు?

ఆ నియోజకవర్గాల్లో సమస్యలు వేటికవే భిన్నం. చాలావరకు పరిష్కరించాం. బహదూర్‌పుర నియోజకవర్గంలో మూసీనది కలుషితం కావడంతో సమస్యలున్నాయి. ఇటీవలే మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎంపీగా నా పరిధిలో నేను సహకారం అందించా. భవిష్యత్తులోనూ అందిస్తా.

  • ప్రత్యర్థుల పేర్లు ప్రస్తావించను కానీ.. ఒకరు ఎలా ప్రచారం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో వారి ఆసుపత్రిపై ఎన్ని ప్రతికూల వార్తలొచ్చాయో అందరికీ తెలిసిందే.
  • పాతబస్తీలో సంప్రదాయబద్ధంగా ఉన్న ఆచారాలు, సంస్కృతుల కారణంగా ఇక్కడ మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌లా బహుళ అంతస్తుల భవనాలు కనిపించవు.
  • ఈ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదేళ్లలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. పేదలకు విద్య, వైద్య సౌకర్యాలు అందించేందుకు కృషిచేశాం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని