logo

భాజపాను ఇంటికి సాగనంపాలి

గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

Published : 07 May 2024 02:25 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

అభివాదం చేస్తున్న సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ శ్రేణుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ‘‘హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేందుకు భాజపా నాయకులు కుట్ర పన్నుతున్నారు. మేధావులను నిర్బంధించి జైళ్లలో పెడుతున్నారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అభివృద్ధి పనులు చేయని బండి సంజయ్‌కి ఎందుకు ఓటు వేయాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పార్టీ కేంద్ర అధిష్ఠానం ఎందుకు పదవి నుంచి దించిందో అందరికీ తెలుసు. సీపీఐ బలపర్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును గెలిపించాలి.’’ అని అన్నారు. అనంతరం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మోదీ మరోమారు అధికారంలోకి వస్తే మనువాదాన్ని, ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెండాను అమలు చేస్తారని తెలిపారు. మతోన్మాద భాజపా, అహంకారపూరిత భారాసలను ఓడించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ.. బండి సంజయ్‌ నియోజకవర్గానికి చేసింది ఏమీలేదన్నారు. ఎంపీ నిధులు రూ.25 కోట్లు మంజూరైతే, రూ.5 కోట్ల అభివృద్ధి పనులు చేశారని, మిగతావి వెనక్కి వెళ్లిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణగౌడ్‌, అరపెల్లి మోహన్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేని శంకర్‌, జిల్లాల కార్యదర్శులు మంద పవన్‌(సిద్దిపేట), కర్రె భిక్షపతి(హనుమకొండ), గుంటి వేణు(సిరిసిల్ల), వెన్న సురేశ్‌(జగిత్యాల), తాండ్ర సదానందం(పెద్దపల్లి), రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని