logo

భాజపాశ్రేణుల్లో జోష్‌!

రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు..

Published : 07 May 2024 02:41 IST

ఏకత చాటుతున్న పెద్దపల్లి ప్రభారి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ  రామచంద్రారావు, సహ ప్రభారి వెంకటేశ్‌గౌడ్‌, సునీల్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, జేపీ నడ్డా, గోమాసె శ్రీనివాస్‌
పెద్దపల్లి (ఈనాడు), పెద్దపల్లి, పెద్దపల్లి కలెక్టరేట్‌ (న్యూస్‌టుడే) : రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. అంటూ చేసిన అభివృద్ధి.. చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రస్తావించడం భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భాజపా పెద్దపల్లి అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌కు మద్దతుగా పెద్దపల్లిలో సోమవారం నిర్వహించిన జనసభలో నడ్డా పాల్గొని స్థానిక అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలో ఎన్‌హెచ్‌-63ని నిజామాబాద్‌, ధర్మపురితోపాటు ధర్మారం, పెద్దపల్లికి అనుసంధానిస్తామని, పెద్దపల్లి- మంచిర్యాల రైల్వే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏళ్లుగా పెద్దపల్లి ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, వారి ప్రయోజనాల కోసం ఒకే కుటుంబసభ్యులు వంతుల వారీగా పాలన సాగిస్తున్నారని ఈ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు చరమగీతం పలకాలని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన వివేక్‌ కుటుంబం ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలను పెట్టి కోటీశ్వరులయ్యారని ఆరోపించారు. సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. తండ్రి తరువాత కొడుకు, మనవడు, ఆ తరవాత మునిమనవడికే అధికారం కట్టబెడతారని ఆరోపించారు. భాజపాతోనే రాష్ట్రానికి, దేశానికి రక్షణ ఉంటుందన్నారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్టీపీసీ ఉత్పాదకతను భాజపా హయాంలోనే రెట్టింపు చేశామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని