logo

ఓట్ల వేటకు దూకుడు

రాష్ట్ర జనాభాలో దాదాపు 10 శాతం ఓట్లున్న లింగాయత్‌లను లక్ష్యం చేసుకుని శనివారం భాజపా ఎన్నికల విజయ విహారాన్ని ప్రారంభించింది.

Published : 22 Jan 2023 02:23 IST

లింగాయత కోటలో విజయ సంకల్పం
నలుదిక్కులా మొదలైన భాజపా జోరు

భాజపా విజయపుర జిల్లా స్థాయి ‘విజయసంకల్పయాత్ర’ వేదిక జ్యోతి వెలిగిస్తున్న జేపీ నడ్డా

ఈనాడు, బెంగళూరు : రాష్ట్ర జనాభాలో దాదాపు 10 శాతం ఓట్లున్న లింగాయత్‌లను లక్ష్యం చేసుకుని శనివారం భాజపా ఎన్నికల విజయ విహారాన్ని ప్రారంభించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయపుర జిల్లాలో, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తుమకూరులో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళీన్‌ కుమార్‌ కటీల్‌ బెంగళూరులో విజయ సంకల్ప అభియాన్‌లకు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలోని నలు దిక్కులా నేతలు విజయ యాత్రలను కొనసాగిచేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ ప్రజాధ్వని, జేడీఎస్‌ పంచరత్న రథయాత్రలకు పోటీగా మొదలైన కమలనాథుల యాత్ర తొలి అడుగు తమకు సంప్రదాయ ఓటర్లుగా భావించే లింగాయత్‌ల కోట నుంచి మొదలు పెట్టటం గమనార్హం.

ఆరాధ్య మఠాలతో..

లింగాయత్‌ సముదాయంతో నడిచే దేవుళ్లుగా కీర్తనలందుకుంటున్న శివకుమార స్వామీ పుణ్య స్మరణ వేదిక సిద్ధగంగా మఠం. ఇటీవల పరమపదించిన మరో లింగాయత్‌ ఆరాధ్య రూపం సిద్దేశ్వర స్వామీ జ్ఞానయోగాశ్రమ్‌లో విజయ సంకల్ప యాత్రలు మొదలుపెట్టారు. విజయపుర జిల్లా నాగఠాణలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిద్దేశ్వర స్వామికి పుష్పాంజలి ఘటించి యాత్రకు శ్రీకారం చుట్టారు. సింధగిలో నిర్వహించిన విజయ సంకల్ప సభతో రాజకీయ ప్రసంగాన్ని ప్రారంభించారు. మరోవైపు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తుమకూరులో శివకుమారస్వామి పుణ్యస్మరణ, జాతీయ మహిళా మోర్చా కార్యక్రమాలతో విజయ సంకల్పాన్ని ప్రారంభించారు. మరోవైపు పార్టీకి సంప్రదాయ బ్రాహ్మణ ఓటర్లు అధికంగా ఉండే జయనగర, బీటీఎం లేఅవుట్‌లో ‘బూత్‌ స్థాయి విజయ సంకల్ప అభియాన్‌’ను నళిన్‌ కుమార్‌ కటీల్‌ మొదలుపెట్టారు. ఈ యాత్రలతో పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభించినట్లే.

ప్రభుత్వాల సాధన

విజయ సంకల్ప యాత్రలో ప్రధాన లక్ష్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గడచిన నాలుగేళ్ల సాధనలు, భవిష్యత్తులో రూపొందించే కార్యక్రమాలపై ప్రచారం చేయాలనేదే. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పాల్గొనే కార్యక్రమాల్లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వ వెసులుబాటుపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమాల్లో వేలాది కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు పార్టీ నిర్వహించే విజయ సంకల్ప యాత్రల్లో భవిష్యత్తు ప్రణాళికలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి మొదలు కార్యకర్తలంతా కనీసం కోటి ఇళ్ల ముందు పార్టీ హామీ కరపత్రాలను అంటించే ప్రక్రియను ముమ్మరం చేస్తారు. వీటితో పాటు పార్టీ జెండాలను బూత్‌ స్థాయిలో ప్రతి ఇంటా ఉంచే ప్రయత్నం చేస్తారు.

అప్పను ప్రసన్నమేనా?

జేపీ నడ్డా విజయ సంకల్పయాత్రకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప పార్టీకి కాస్త ఊరట కల్పించారు. గత శుక్రవారం పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బి.ఎల్‌.సంతోశ్‌ నేతృత్వంలోని చింతన మంథన సమావేశానికి గైర్ఞాజరైన యడియూరప్ప పార్టీలో కలకలం సృష్టించారు. ఇటీవల పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో 15 నిమిషాల పాటు చర్చించిన యడియూరప్ప పార్టీకి కొన్ని సంకేతాలు పంపారు. ఆ సందర్భంగా కొన్ని డిమాండ్లను ప్రధాని ముందు ఉంచినట్లు సమాచారం. తన కుమారుడు విజయేంద్రకు టికెట్‌తో పాటు తాను సూచించిన వారికి టికెట్‌ ఇవ్వాలన్న ప్రతిపాదన ప్రధాని ముందు ఉంచారు. ఆయన ప్రతిపాదనలకు ప్రధాని స్పందన ఏమిటో తెలియరాలేదు. ఆ వెంటనే బెంగళూరులో నిర్వహించిన పార్టీ సమావేశానికి గైర్హాజరై, శనివారం విజయ సంకల్ప యాత్రకు హాజరైన యడియూరప్ప తీరు పార్టీకి అంతు చిక్కని సంకేతాలను పంపుతోంది.

సింధగి సమావేశానికి హాజరైన ప్రజలు, భాజపా కార్యకర్తలు, సానుభూతిపరులు

కొత్త వ్యూహాలు

భాజపా విజయ సంకల్ప యాత్ర సంప్రదాయ ఓటర్లతో మొదలై కొత్త సముదాయాల లక్ష్యంతో కొనసాగుతుంది. ఈ దిశగా ఉత్తర కర్ణాటక, మధ్య కర్ణాటక, బెంగళూరు నగరంలో మొదలై ఫిబ్రవరిలో మైసూరు, దావణగెరె, కొడగు, బెంగళూరు గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర ద్వారా 60లక్షల లింగాయత్‌లు, 50లక్షల ఒక్కలిగలు, 1.1కోట్ల ఎస్‌సీ, ఎస్‌టీలు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగేలా చేస్తారు. ఈనెల చివరన అమిత్‌ షా, ఫిబ్రవరి రెండో వారంలో ప్రధాని పర్యటనలు ఈ ప్రణాళికల్లో భాగంగానే రూపొందిస్తారు.


జనం మాటే అజెండా

పార్టీ ఇంటింటి ప్రచార బిళ్లలను ఓ వాకిట ప్రదర్శిస్తున్న బసవరాజ బొమ్మై

తుమకూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ఎన్నికల ముందే ప్రజాభిప్రాయాలు సేకరించి, వారి సూచనల ఆధారంగానే భాజపా మేనిఫెస్టోకు రూపునిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. ఆయన తుమకూరు నగరంలోని విశ్వవిద్యాలయం సమీపంలో భాజపా ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్రలో శనివారం పాల్గొని ప్రసంగించారు. మరో తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ప్రచారపర్వం కొనసాగిస్తామని వివరించారు. పార్టీలో కొత్తగా లక్ష్య మందికి సభ్యత్వం ఇచ్చామన్నారు. మరిందరిని పార్టీలో చేర్చుకోవడానికి కార్యకర్తలు ముందడుగు వేయాలన్నారు. ప్రతి ఇంటికీ కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేయాలని, సభ్యత్వం కోసం మిస్డ్‌కాల్‌ విధానాన్ని అమలు చేయాలని, పార్టీ స్టిక్కర్లు ఇంటింటా కనిపించాలని, గోడలపై ప్రచార నినాదాలు జోరందుకోవాలనీ సూచించారు. ఇదే వేదికపై మహిళా ప్రతినిధులు బొమ్మైని గజమాలతో ఘనంగా సత్కరించారు. పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌, మహిళా మోర్చా జాతీయ అద్యక్షురాలు వాసంతి శ్రీనివాస్‌, ప్రముఖులు దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌, గీతా వివేకానంద, మంత్రి శశికళా జొల్లే, ఎం.పి. బసవరాజ్‌, ప్రముఖులు అంబికా, రవిశంకర్‌ పాల్గొన్నారు.


 

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని