logo

రూ. 3.61 లక్షల మద్యం చోరీ

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలోని కార్తికేయ మద్యం దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున ఒకటిన్నర సమయంలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.

Published : 07 Jun 2023 03:51 IST

అన్నపురెడ్డిపల్లి, న్యూస్‌టుడే: అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలోని కార్తికేయ మద్యం దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున ఒకటిన్నర సమయంలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. దుకాణం వెలుపల ఉన్న రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, షట్టర్‌ తాళాలు బద్దలు కొట్టి దుకాణంలోకి ప్రవేశించి అక్కడున్న సీసీ కెమెరా వైర్లను తొలగించాడు. సుమారు 52 అట్ట పెట్టెల్లోని మద్యం బాటిళ్లను అపహరించాడు. ఉదయాన్నే దుకాణం వద్దకు వచ్చిన నిర్వాహకుడు చోరీ జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ వసంత్‌కుమార్‌, ఎస్సై షాహీనా, కొత్తగూడెం క్లూస్‌టీం సభ్యులు దుకాణాన్ని సందర్శించి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. అపహరణకు గురైన మద్యం బాటిళ్ల విలువ రూ.3.61లక్షలు ఉంటుందని దుకాణ నిర్వాహకులు తెలిపారు.


ట్రాక్టర్‌ కింద పడి డ్రైవర్‌ దుర్మరణం

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి డ్రైవర్‌ మృతిచెందిన ఘటన మద్దివారిగూడెం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలిశెట్టిగూడేనికి చెందిన నగేశ్‌(35).. మద్దివారిగూడెంలోని ఓ రైతు దగ్గర ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మద్దివారిగూడెం శివారులో ట్రాక్టర్‌తో పత్తి కట్టె దున్ని తిరిగొస్తూ ఓచోట ట్రాక్టర్‌ ఆపి వెనుక ఇనుప రాడ్‌ను సరిచేసేందుకు ఉపక్రమించారు. ట్రాక్టర్‌ వెనుకకు రావటంతో నగేశ్‌ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.


రూ.20 లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం: భద్రాచలం పోలీసులు రూ.20 లక్షల గంజాయిని మంగళవారం పట్టుకున్నారు. ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌   ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, ఎస్సైలు శ్రీకాంత్‌, సురేశ్‌ నేతృత్వంలో పోలీసులు స్థానిక కూనవరం రోడ్డుపై తనిఖీలు చేస్తుండగా రెండు కార్లు అనుమానాస్పద రీతిలో కనిపించడంతో వాటిని ఆపి పరిశీలించారు. వాటిలో 100 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితులు అదిలాబాద్‌కు చెందిన మహ్మద్‌ అర్షద్‌ఖాన్‌, షేక్‌ అబ్దుల్‌, రహమాన్‌ ఖాన్‌, అభిజిత్‌ పట్టుపడ్డారు. వీరు ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దులోని సీలేరు ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొని చేసి తమ ప్రాంతంలో విక్రయించేందుకు తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ దందాతో సంబంధం ఉన్న మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నట్లు     సమాచారం. రెండు కార్లు, గంజాయిని స్వాధీనపరచుకొని నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ నాగరాజురెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని