logo

భారాస హయాంలోనే సమగ్రాభివృద్ధి

కాంగ్రెస్‌, భాజపాకు ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనని.. గులాబీ జెండా ఒక్కటే ప్రజలకు అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత  కేసీఆర్‌ అన్నారు.

Published : 30 Apr 2024 05:10 IST

మాజీ సీఎం కేసీఆర్‌

రోడ్‌షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్‌, చిత్రంలో ఎంపీ అభ్యర్థి నామా, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తదితరులు

ఈటీవీ, ఖమ్మం: కాంగ్రెస్‌, భాజపాకు ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనని.. గులాబీ జెండా ఒక్కటే ప్రజలకు అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత  కేసీఆర్‌ అన్నారు. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు భారాసను గెలిపించాలని పిలుపునిచ్చారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ఖమ్మం నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడారు. తాను ఒక్కడిగా బయలుదేరిన రోజు ఎవరికీ తెలంగాణ ఏర్పడుతుందనే నమ్మకం లేదని, ఆమరణ దీక్షకు పూనుకుంటే ఖమ్మం జైలుకు తీసుకొస్తే ఈ జిల్లా బిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు బ్రహ్మాండంగా తనకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. సబ్బండ వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని వ్యాఖ్యానించారు.

పంటలు ఎండుతుంటే మంత్రులేం చేశారు..?

అసమర్థ ప్రభుత్వం, మంత్రుల చేతగానితనం వల్లే ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోయాయని కేసీఆర్‌ మండిపడ్డారు. భారాస హయాంలో సాగర్‌ జలాశయంలో 495 అడుగులకు నీటిమట్టం పడిపోయినా.. పంటలకు సాగునీరు అందించామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 510 అడుగులు ఉన్నా సాగునీరు అందించలేదన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు, పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నా.. సాగునీరు అందించకుండా పంటలను ఎండబెట్టారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి కాదు.. వట్టి విక్రమార్క అని ఎద్దేవా చేశారు. భక్తరామదాసు నుంచి నీళ్లివ్వకుండా పాలేరును ఎండబెట్టిన పాపం మంత్రులదేనన్నారు. మూడు, నాలుగు నెలల్లోనే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఖమ్మం నగరంలో భారాస హయాంలో నిత్యం తాగునీరు అందిస్తే.. ఇప్పుడు మూడ్రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ట్యాంకర్లు కొనే దుస్థితి వచ్చిందని తెలిపారు. పాలేరు గేట్లు ఎత్తి తూములు బద్ధలు కొడతామని రైతులు దండయాత్ర చేసే పరిస్థితి ఎందుకొచ్చిందో ప్రజలు గమనించాలన్నారు. జిల్లా అభివృద్ధి చెందాలని నామా నాగేశ్వరరావు ఆరాటపడుతుంటారని పేర్కొన్నారు. నామా గెలిచి భారాస నిలిస్తేనే.. కాంగ్రెస్‌  సర్కారు హామీలు నెరవేరుస్తుందని చెప్పారు.

జడ్పీ సెంటర్‌ వద్ద రోడ్‌షోకు హాజరైన జనం

అధినేతకు నీరాజనం..

కాల్వొడ్డు వద్ద కేసీఆర్‌ బస్సు యాత్రకు బతుకమ్మలు, బోనాలు, హారతులతో భారాస నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. రోడ్‌షోలో భాగంగా కాల్వొడ్డు, మయూరి సెంటర్ల వద్ద కేసీఆర్‌పైకి పువ్వాడ సైన్యం, వద్దిరాజు యువసేన కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. టపాసుల మోత మోగించారు. తర్వాత జడ్పీ సెంటర్‌లో కిక్కిరిసిన జన సందోహం మధ్య కేసీఆర్‌ ప్రసంగించారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ, మదన్‌లాల్‌, మెచ్చా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ ఇంట్లో కేసీఆర్‌ సోమవారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో భారాస గెలవబోతోందని, అన్ని సర్వేలు నామాకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తల్లాడ, జూలూరుపాడు, కొత్తగూడెంలో రోడ్‌ షోలను కేసీఆర్‌   మంగళవారం నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని