logo

వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను

ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే.

Published : 17 May 2024 02:00 IST

‘క్యూఆర్‌ కోడ్‌’ ఉపయోగాలు వివరిస్తున్న శాస్త్రవేత్త నీలిమ

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. సాధారణ విద్యలో దీని సహాయంతో బోధనా విధానం మెరుగుపరిచినా వ్యవసాయ విద్యలో మాత్రం కొంత వెనకబడింది. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్‌ నీలిమ రెండు నెలలు ఎంతో కృషి చేసి ఈ సమస్యను అధిగమించారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ‘బోధించడం - నేర్చుకోవడం’ విధానంలో భాగంగా ‘క్షేత్రస్థాయిలో పంటల సాగుపై అవగాహన’ కోసం ‘క్యూఆర్‌’ కోడ్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇందులో 80 రకాల వంగడాలు, వాటి సాగు విధానం గురించి అంతర్జాలంలో నీలిమ పొందుపరిచారు.

వంగడం, రకం పేరు, మొక్క, విత్తనం నాటిన సమయం, వాటి జీవిత కాలం, ఆశించే తెగుళ్లు, మందుల వాడకం, దిగుబడి, సాగు విధానం, నీటి యాజమాన్య పద్ధతులు ఇలా అన్ని అంశాలు అంతర్జాలంలో పొందుపర్చారు. కళాశాల వ్యవసాయ ప్రాంగణంలోని పలు వృక్షాలు, మొక్కలు వద్ద ఈ ‘క్యూఆర్‌’ కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. క్యూఆర్‌ కోడ్‌ను స్మార్టు ఫోన్‌తో స్కాన్‌ చేస్తే చాలు ఆ మొక్క పూర్తి సమాచారం వస్తుంది. ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ కళాశాలల్లో ఇక్కడే ప్రథమంగా ప్రవేశ పెట్టడం విశేషం.


ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు : సంధ్య, విద్యార్థిని

ఖాళీ సమయాల్లో కళాశాల వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ వంగడాల సాగుపై అవగాహన మరింత పెంచుకుంటున్నాం. ఈ విధానంతో ఆయా పంటల సాగు విధానం సులువుగా నేర్చుకునేందుకే కాదు.. సులువుగా గుర్తుండిపోతుంది.


అధిక మార్కులు సాధించే వీలుంది

- ప్రభాకర్‌, విద్యార్థి

బీఎస్సీ అగ్రికల్చర్‌ నాలుగో ఏడాది విద్యలో భాగంగా క్షేత్ర స్థాయిలో పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. సాగుచేసిన పంటలు విత్తిన దగ్గర నుంచి కోసే వరకు అంటే దుక్కులు, విత్తనం నాటడం, పంటల యాజమాన్య పద్ధతి, దిగుబడి ఇలా అన్ని మేమే చేస్తాం. అప్పుడు ఈ విధానంలో నేర్చుకున్న అంశాలు ఎంతో ఉపయోగపడతాయి. పరీక్షల్లోనూ అధిక మార్కులు సాధించే వీలుంది.


ఎంతో ఉపయుక్తం: డాక్టర్‌ నీలిమ, వ్యవసాయ శాస్త్రవేత్త

ఈ విధానం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. తరగతి గదిలో అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలు వినడంతోపాటు క్షేత్రస్థాయిలో సాగుచేసిన పంట భూముల్లోని మొక్కల వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను స్మార్టు ఫోన్‌తో స్కాన్‌ చేస్తే వాటి పూర్తి సమాచారం, వివిధ స్థాయిల ఫోటోలు వస్తాయి. విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అంతేగాక ఈ కళాశాలను సందర్శించిన వేరే ప్రాంతాల విద్యార్థులూ పంటల సాగు గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని