logo

సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Updated : 03 May 2024 06:30 IST

చిప్ప శ్రీను మృతదేహం
ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సీఐ కరుణాకర్‌ తెలిపిన ప్రకారం.. వజ్జవారిగుంపు గ్రామానికి కొన్నేళ్ల క్రితం సుజాత అనే మహిళ తన భర్తతో కలిసి వచ్చింది. వీరికి ఓ కుమార్తె. భర్త కొన్నేళ్ల క్రితం ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్న చిప్ప శ్రీను(43)తో ఆమె మూడేళ్లుగా సహజీవనం సాగిస్తోంది. కొన్ని రోజులుగా శ్రీను మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి గొడవ జరిగింది. అనంతరం శ్రీను మెడకు సునీత తాడు బిగించి హత్యచేసింది. ఘర్షణ క్రమంలో తాను నెట్టేయటంతో ప్రమాదవశాత్తు తలకు మంచం తగిలి చనిపోయినట్టు సుజాత నమ్మబలికింది. దీనిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి గురువారం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో శవపరీక్ష నిర్వహించారు. చెవికి గాయంతోపాటు మెడకు తాడు బిగించిన ఆనవాళ్లు గుర్తించారు. పోలీసుల విచారణతో ఎట్టకేలకు తానే హత్యచేసినట్టు సునీత అంగీకరించింది. శ్రీను కుటుంబీకుల వివరాలు తెలియరాలేదు. ఆధార్‌ కార్డులో కొత్తగూడెం వాసి అని ఉంది. అక్కడ విచారించినా సంబంధీకుల వివరాలు తెలియకపోవటంతో శవపరీక్ష అనంతరం సుదిమళ్ల కార్యదర్శి మహ్మద్‌ అజాహర్‌ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది శ్రీను అంత్యక్రియలు నిర్వహించారు.


అస్వస్థతతో లారీలోనే ప్రాణాలొదిలిన డ్రైవర్‌

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: లారీ డ్రైవర్‌పై మృతిపై గ్రామీణం ఠాణాలో గురువారం కేసు నమోదైంది. రాజస్థాన్‌ రాష్ట్రం నసీరాబాద్‌ తాలుకా లవేరా గ్రామానికి చెందిన మహావీర్‌ ప్రసాద్‌ (58) లారీ డ్రైవర్‌. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌గఢ్‌ నుంచి తమిళనాడులోని నైవేలికి రైలు పట్టాలను ట్రక్కులో లోడు చేసుకుని ఏప్రిల్‌ 26న బయలుదేరాడు. గత నెల 30న పాల్వంచ మండలం కేశవాపురం చేరుకున్నాడు. అదే రోజు రాత్రి స్థానికంగా లారీని నిలిపి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై 10 గంటల సమయంలో లారీలోనే ప్రాణాలు విడిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారొచ్చి మృతదేహాన్ని పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువులు గురువారం మృతదేహాన్ని తీసుకెళ్లారు. వారి ఫిర్యాదుతో గ్రామీణం ఏఎస్సై సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ మృతికి వడదెబ్బ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని