logo

ఎగువ, దిగువ సభల్లో ప్రాతినిధ్యం

భారత పార్లమెంట్‌లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

Updated : 03 May 2024 06:38 IST

రెండుసార్లు కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న రేణుకాచౌదరి

 ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: భారత పార్లమెంట్‌లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి ఒకరు. ఆమె ఖమ్మం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఆమె నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదివరకు తెదేపా నుంచి రెండుసార్లు, కాంగ్రెస్‌ నుంచి ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తెదేపా నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు, ఖమ్మం నుంచి లోక్‌సభకు ఎన్నికైనప్పుడు రేణుకాచౌదరి కేంద్రంలో మంత్రి పదవులు దక్కించుకున్నారు.

 తెదేపాతో రాజకీయ అరంగేట్రం

 1984లో తెదేపాలో చేరిన రేణుకాచౌదరి 1986లో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తెదేపా తరఫున 1986 నుంచి 1998 వరకు వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ్‌ కేబినెట్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఆమె తెదేపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 1999లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2004లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి ఎన్నికై మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమె 2014లో పోటీచేయలేదు. 2019లో పోటీచేసి ఓటమి చెందారు. 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. తాజాగా 2024లోనూ కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె నాలుగోసారి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. లోక్‌సభ సభ్యురాలిగా రెండుసార్లు పనిచేశారు. లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికవటం, రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఆమె ప్రత్యేకత నిలుపుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని