logo

దంపతులను బలిగొన్న టిప్పర్‌

టిప్పర్‌ ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకొంది.

Published : 06 May 2024 01:38 IST

కుంపటి సామేలు, పద్మ (పాతచిత్రం)

లక్ష్మీదేవిపల్లి, న్యూస్‌టుడే: టిప్పర్‌ ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకొంది. పోలీసు వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం మంచికంటినగర్‌కు చెందిన కంపటి సామేలు(57), భార్య పద్మ(45)తో కలిసి టేకులపల్లి మండలం చింతోనిచెలకలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. టీవీఎస్‌ ద్విచక్రవాహనంపై తిరిగొస్తున్నారు. అనిశెట్టిపల్లి వద్ద రహదారి దాటుతున్న సమయంలో వీరిని పాల్వంచ నుంచి ఇల్లెందు వెళ్లే టిప్పర్‌ వేగంగా ఢీకొంది. దీంతో పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సామేలును కొత్తగూడెం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. సామేలు పాల్వంచ దమ్మపేట సెంటర్‌లో చర్మకార వృత్తిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు. 


దైవదర్శనానికి వెళ్లొస్తూ.. అనంత లోకాలకు..

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆ కుటుంబం ఎంతో సంతోషంగా పెద్దమ్మతల్లిని దర్శించుకుంది. తిరిగి వస్తుండగా ప్రమాద రూపంలో విధి ఇంటి పెద్దదిక్కును బలితీసుకుంది. ఈ ఘటనలో అతడి భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్‌ పంచాయతీ ఇందిరానగర్‌కు చెందిన సంగెం వీరన్న(40) భార్య సైదమ్మ, కుమారుడు వినయ్‌తో కలిసి ఆదివారం పాల్వంచ పెద్దమ్మతల్లి దర్శనానికి వచ్చారు. మొక్కులు చెల్లించుకుని తిరిగి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పాల్వంచ పట్టణం ఇందిరానగర్‌కాలనీ వద్ద మరో బైకు అకస్మాత్తుగా అడ్డొచ్చింది. వాహనాన్ని తప్పించబోయిన వీరన్న పక్కనున్న డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన భార్య సైదమ్మను పాల్వంచ సీహెచ్‌సీలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. వినయ్‌ తల, నడుము భాగంలో దెబ్బలు బాగా తగలడంతో కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. శ్రీనగర్‌ మాజీ ఉపసర్పంచి లగడపాటి రమేశ్‌ బాధితులను పరామర్శించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఎస్సై బి.రాము కేసు నమోదు చేశారు.  


వడదెబ్బతో ఇద్దరి మృతి

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: భద్రాచలంలో వడదెబ్బతో ఆదివారం ఇద్దరు మృత్యువాత పడ్డారు. సుభాష్‌నగర్‌ కాలనీకి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి చింతకాయల సంజయ్‌(15) శనివారం సాయంత్రం వడదెబ్బ తగిలి వాంతులు, విరోచనాలు అవడంతో చికిత్స అందించారు. తీవ్రత కొద్దిగా నెమ్మదించినా ఆదివారం తెల్లవారుజామున మళ్లీ ఇబ్బంది కలగడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించినట్టు బాలుడి తండ్రి మహేశ్‌ తెలిపారు.

భద్రాచలం: రాజుపేట కాలనీకి చెందిన కె.లక్ష్మయ్య(55) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. ఆదివారం ఉదయం కొద్దిసేపు పనిచేసి ఇంటికొచ్చి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. వడదెబ్బతో మృత్యువాత పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మయ్య భౌతికకాయాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని