logo

వేసవి తాపం.. మారిన షిఫ్ట్‌ సమయం

సింగరేణి ఉపరితల గనుల్లో షిఫ్ట్‌ వేళలు మారాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, రెండో షిఫ్ట్‌ సమయాల్లో యాజమాన్యం మార్పులు చేసింది.

Updated : 06 May 2024 05:57 IST

కొత్తగూడెం సింగరేణి, గోదావరిఖని, న్యూస్‌టుడే

సింగరేణి ఉపరితల గనుల్లో షిఫ్ట్‌ వేళలు మారాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, రెండో షిఫ్ట్‌ సమయాల్లో యాజమాన్యం మార్పులు చేసింది. సాధారణంగా ఉదయం షిఫ్ట్‌ 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 వరకు కొనసాగుతుంది. మూడో షిఫ్ట్‌ కార్మికులు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పనిచేయనున్నారు. మొదటి షిఫ్ట్‌ను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ను సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు సింగరేణి యాజమాన్యం మార్చింది. ఉపరితల గనుల్లో పనిచేసే ఉద్యోగులకు మద్యాహ్నం రెండు గంటల విరామాన్ని ప్రకటించింది. మద్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల దాకా  విరామం కొనసాగుతుంది. ఈ విధానాన్ని సోమవారం నుంచి మే 31 వరకు యాజమాన్యం అమలుచేయనుంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఉపరితల గనుల్లో పనిచేసే ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావటం లేదు. ముఖ్యంగా ఉదయం, రెండో షిఫ్ట్‌ విధులు నిర్వర్తించే కార్మికులు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా 19 ఉపరితల గనుల్లో సుమారు 17 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఆపరేటర్లతో పాటు కేబుల్‌ బాయ్స్‌, సాంకేతిక సిబ్బంది ఉపరితల గని క్వారీల్లో పనిచేయాల్సి ఉండటంతో ఎండ వేడికి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉపరితల గని క్వారీల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఉద్యోగులు ఈ గనుల్లో పనిచేసేందుకు అవస్థలు పడుతున్నారు. బొగ్గు ఉత్పత్తిపైనా ప్రభావం పడే అవకాశముంది.

పని గంటలపై అసంతృప్తి

షిఫ్ట్‌ వేళలు మార్చినా పని గంటలు యథావిధిగా ఉన్నాయని కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది. సాధారణంగా ప్రతి షిఫ్ట్‌కు ఎనిమిది గంటలను పనిదినం కింద లెక్కిస్తారు. ప్రస్తుతం యాజమాన్యం సమయాలు మార్చినా.. ఎనిమిది గంటల పనిని మాత్రం కుదించలేదు.  ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు సమయం కేటాయిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   ఉద్యోగులు విధుల్లో చేరిన తర్వాత మధ్యలో గంట విరామం ఉంటుంది. భోజన సమయం కింద గంట పాటు విశ్రాంతి ఇస్తారు. ఈ సమయాన్ని భోజనానికి వినియోగించకుండా విధుల్లో చేరింది మొదలు విరామం లేకుండా పనిచేస్తామని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని