logo

విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి దుర్మరణం

విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో ఓ భవన నిర్మాణ పనుల కోసం గుత్తేదారు, ఏపీలోని కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం బాలరామపురానికి చెందిన దాసరి సూరిబాబు(40), మరి కొందరిని తీసుకొచ్చాడు.

Published : 08 May 2024 02:34 IST

దాసరి సూరిబాబు

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో ఓ భవన నిర్మాణ పనుల కోసం గుత్తేదారు, ఏపీలోని కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం బాలరామపురానికి చెందిన దాసరి సూరిబాబు(40), మరి కొందరిని తీసుకొచ్చాడు. వీరంతా నిర్మాణం జరుగుతున్న భవనంలోనే ఉంటూ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పనులు ముగిసిన తర్వాత స్నానం చేసిన సూరిబాబు తడి కండువాను భవనం స్తంభానికి కట్టి ఉన్న విద్యుత్తు మోటారు తీగపై ఆరేస్తుండగా అది తెగి విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. తోటి కూలీలు అతడిని అశ్వారావుపేట సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే సూరిబాబు మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. మృతుడి అన్న దాసరి అప్పన్నబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.


రైలు కింద పడి ఆత్మహత్య

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: ఖమ్మం-మల్లెమడుగు రైల్వేస్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి(40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జీఆర్పీ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 6న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో డోర్నకల్‌ వైపునకు వెళ్తున్న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ కె.శ్రీనివాసరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అన్నం సేవా ఫౌండేషన్‌ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు, బృందం సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, నీలం, తెల్లరంగు గళ్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని, వ్యక్తిగత వివరాలేమీ తెలియరాలేదని హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.


చెక్‌బౌన్స్‌ కేసులో వ్యక్తికి జైలుశిక్ష

ఇల్లెందు, న్యూస్‌టుడే: చెక్‌బౌన్స్‌ కేసులో ఓ వ్యక్తికి శిక్ష పడింది. ఇల్లెందు కోర్టు సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ఆంబజార్‌కు చెందిన కె.శివనారాయణ అదే ఏరియాకు చెందిన ఓంప్రకాష్‌ వద్ద 2016లో చెక్కును పూచీకత్తుగా పెట్టి రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ చెక్కు బౌన్స్‌ కావడంతో ఓంప్రకాష్‌ కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో ఇల్లెందు కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కీర్తి చంద్రికారెడ్డి తీర్పు చెబుతూ శివనారాయణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానతోపాటు, మూడు నెలల వ్యవధిలో తీసుకున్న అప్పు రూ.4 లక్షలు ఓంప్రకాష్‌కు చెల్లించాలని ఆదేశించారు.


రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

విఘ్నేష్‌

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎదుటివారి అతివేగం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఖమ్మం నగరం వైఎస్‌ఆర్‌కాలనీ వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఖానాపురం హవేలి ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ కథనం ప్రకారం... స్థానికంగా నివసించే మల్లారపు కృష్ణ... కుమారుడు విఘ్నేష్‌ (16) పదో తరగతి ఇటీవలే పాసయ్యాడు. స్కూటీ మీద ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ నుంచి వైఎస్‌ఆర్‌ కాలనీకి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఇతణ్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ విఘ్నేష్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రెండో ద్విచక్ర వాహనంపై ఉన్న సంగాపు భాస్కర్‌, ప్రశాంత్‌ సైతం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఘటనపై విఘ్నేష్‌ తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

నేడు పుట్టిన రోజు.... ఆటో డ్రైవరుగా పని చేసే కృష్ణ కుమారుడు విఘ్నేష్‌ బుధవారం(8న) పుట్టిన రోజు వేడుక జరుపుకోనున్నాడు. రెండు రోజుల ముందే కొత్త దుస్తులు కొనుక్కుని బంధువులు, స్నేహితుల ఎదుట వేడుక కోసం సిద్ధమవుతున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతణ్ని బతికించేందుకు స్థానికులు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. చేతికి వచ్చిన కొడుకు కళ్లముందు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, సోదరి రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.

గంజాయి మత్తేనా?... ఈ ప్రమాదానికి గంజాయి మత్తే కారణమని తెలుస్తోంది. ద్విచక్ర వాహనంపై ఉన్న యువకులు గంజాయి మత్తులో అతివేగంగా నడిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంజిన్‌ సైతం పగిలిపోవడం వేగ తీవ్రతను సూచిస్తోంది.


ఆర్టీసీ బస్సు ఢీకొని..

కొణిజర్ల, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదం పల్లిపాడు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... భద్రాద్రి జిల్లా చుంచుపల్లి గాంధీనగర్‌కాలనీకి చెందిన కొరడాల రామకృష్ణ(40) బైక్‌పై ఖమ్మం నుంచి చంచుపల్లి వెళ్తున్నాడు. పల్లిపాడు వద్ద ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో అతడి వాహనాన్ని ఎదురుగా వచ్చి ఢీకొంది. కొంతదూరం వరకు అతన్ని లాక్కోని వెళ్లింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై శంకరరావు ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.


హత్యాయత్నం కేసు కొట్టేసిన హైకోర్టు

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో రాజకీయంగా సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసును హైకోర్టు కొట్టేసింది. వివరాల ప్రకారం.. భూతగాదాల నేపథ్యంలో 2021 ఆగస్టు 8న మంచుకొండ గ్రామానికి చెందిన మందడపు సుధాకర్‌, మందడపు మాధవరావు, యల్లంపల్లి హనుమంతరావుపై ఖానాపురం హవేలీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులు తనను హత్య చేసేందుకు ముగ్గురు రౌడీషీటర్లకు రూ.30 వేల నగదు, రెండు వేట కొడవళ్లు సరఫరా చేశారని తుళ్లూరి శ్రీనివాసరావు ఆరోపణ. పోలీసులు మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి ఖమ్మం అదనపు అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన జస్టిస్‌ కె.సుజన నిందితులు ప్రత్యక్ష చర్యలకు పాల్పడినట్లు నేరాభియోగాలు లేవని అభిప్రాయపడుతూ కొట్టేశారు. నిందితుల తరపున ఖమ్మం కోర్టులో కిలారు బాబ్జీ, హైకోర్టులో సి.చరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు.


నకిలీ తుపాకీతో బెదిరించి డబ్బు వసూలు

దంపతులను అరెస్టు చేసిన పోలీసులు

ఖమ్యం నేరవిభాగం, న్యూస్‌టుడే: నకిలీ తుపాకీ(పిస్టల్‌)తో బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేసిన దంపతులను అరెస్టు చేసినట్టు ఖానాపురం హవేలి పోలీసు ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ తెలిపారు. నగరంలోని కవిరాజనగర్‌లో నివాసముంటున్న ఓ వ్యాపారి ఇంట్లోకి ఈ నెల 1న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి తాము నక్సలైట్లమని బెదిరించారు. రూ.లక్ష నగదు ఇవ్వకపోతే చంపుతామంటూ బెదిరించి చివరకు రూ.5 వేలు తీసుకుని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో శ్రీశ్రీ సర్కిల్‌లో సోమవారం వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన కూలి పనులు చేసే రాయల వెంకటేశ్వర్లు(ఎస్‌వీరెడ్డి), టైలరింగ్‌ చేసే అతని భార్య శ్రీలతలను అదుపులోకి తీసుకుని విచారించగా సదరు వ్యాపారిని బెదిరించినట్లు వెల్లడించారు. సులువుగా డబ్బు సంపాదించాలని నేర ప్రవృత్తిని ఎంచుకున్నారని, గతంలో 12 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.3 వేల నగదు, బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.


ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు

సుజాతనగర్‌, న్యూస్‌టుడే: ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై జుబేదా బేగం వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)ను స్థానికుడైన యువకుడు సాయి (22) రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించకుంటే కలిసి దిగిన ఫొటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు. ఏం జరిగిందని కుటుంబ సభ్యులు బాలికను ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని