logo

కుందూలో జగన్నాటకం

జగన్‌ మాటలు నీటి మూటలయ్యాయి.. వంద పల్లెలను వరద పోటు నుంచి రక్షించే పనులు కాలేదు.. వందల ఎకరాలకు సాగు నీరిచ్చే రాజోలి, జొలదరాశి జలాశయాలకు పునాది పడలేదు.

Updated : 14 Mar 2024 06:41 IST

నది విస్తరణ అటకెక్కింది
జొలదరాశికి అడుగు పడలేదు

కుందూనదిపై జొలదరాశి జలాశయం నిర్మించే ప్రాంతం


‘‘ బనకచెర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నానది వరకు 187 కి.మీ. మేర కుందూ నది విస్తరణకు తాము సిద్ధం.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్య అంశంగా దీన్ని చేయిస్తాం ’’

 ప్రజా సంకల్ప యాత్రలో 2017 నవంబరు 18న రైతులకు జగన్‌ ఇచ్చిన హామీ.. మాటలే కాదూ ఏకంగా రైతుల వినతి పత్రాలపై సంతకం చేశారు.

కుందూ వరద నీటిని కేసీ ఆయకట్టుకు మళ్లించి 91,000 ఎకరాలు స్థిరీకరించేందుకు రాజోలి , జొలదరాశి జలాశయాల నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించాం. మూడేళ్లలో పూర్తి చేసి రైతులకు కానుకగా అందిస్తాం.  

2019 డిసెంబరు 23న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలివి.!!


జగన్‌ మాటలు నీటి మూటలయ్యాయి.. వంద పల్లెలను వరద పోటు నుంచి రక్షించే పనులు కాలేదు.. వందల ఎకరాలకు సాగు నీరిచ్చే రాజోలి, జొలదరాశి జలాశయాలకు పునాది పడలేదు. మూడేళ్ల కిందట విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినా పురోగతి కరవైంది. ప్రభుత్వం పైసా విడుదల చేయకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. వచ్చిన మట్టిని స్థానిక నేతలు అమ్ముకొని రూ.లక్షలు వెనకేసుకొన్నారు. జలాశయాల కోసం భూములు సేకరించారు..క్రయ విక్రయాలు లేకుండా రెడ్‌ మార్కులో పెట్టారు. పరిహారం మాత్రం ఇవ్వలేదు. భూముల్ని అమ్ముకోలేక.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

బనగానపల్లి, కోవెలకుంట్ల, నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే


ఈ నెలాఖరుకు పూర్తి కావాలి

బనకచెర్ల నిప్పులవాగు నుంచి వైఎస్సార్‌ జిల్లా ఆదినిమ్మాయపల్లె పికప్‌ ఆనకట్ట వరకు 189.2 కి.మీల పొడవునా కుందూనదిని రూ.1725 కోట్లతో విస్తరించనున్నట్లు మూడేళ్ల కిందట ప్రకటించారు.  2021 మార్చిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2024 మార్చిలోగా పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం నదిలో వరద సమయంలో నిత్యం సగటున 2 టీఎంసీలు ప్రవహిస్తోంది. 3 టీఎంసీలకు పెంచే లక్ష్యంతో విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఆయా ప్రాంతాల్లో 40 నుంచి 200 మీటర్ల వెడల్పున విస్తరించాల్సి ఉంది.


భూ సేకరణ బూటకం

కుందూ విస్తరణకు 7,500 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో 1,500 ఎకరాలు ప్రభుత్వ భూమి మిగిలిన ఆరు వేల ఎకరాలు పాములపాడు, వెలుగోడు, బండిఆత్మకూరు, నంద్యాల, పాణ్యం, గోస్పాడు, కోవెలకుంట్ల, బనగానపల్లి, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, కోవెలకుంట్ల, చాగలమర్రి, వైఎస్సార్‌ జిల్లాలోని దువ్వూరు, ఖాజీపేట, చాపాడు, మైదుకూరు, చెన్నూరు మండలాల్లో రైతుల నుంచి సేకరించాల్సి ఉంది.


రక్షణ గోడ ఊసే లేదు

నంద్యాల పట్టణం నందమూరి నగర్‌, తొగర్చేడు, మిట్నాల, మద్దూరు, బండిఆత్మకూరు, వేల్పనూరు, సంతజూటూరు, అనుపూరు, కూలూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో 25 వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఇంత వరకు ఒక్క దానికి పునాదులు తీయలేదు. బండిఆత్మకూరుతో పాటు నంద్యాల పట్టణంలోని ప్రథమనంది ఆలయం వెనుకవైపు రక్షణ గోడలు నిర్మించాలి.


వంద గ్రామాలకు వరద పోటు

నది తక్కువ వెడల్పులో ఉండటంతో ఏటా వర్షాకాలంలో వరద ముంచెత్తుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే విస్తరణ ఎంతో అవసరం ఇక్కడి రైతులు ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని రాణి, మహారాణి థియేటర్ల వెనుక వైపు, ప్రథమనంది ఆలయ సమీపంలో, పాణ్యం మండలం తొగర్చేడు, మద్దూరు, వెలుగోడు మండలంలోని వేంపెంట, వేల్పనూరు, మాధవాపురం  గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో రూ.225 కోట్ల విలువైన పనులు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం బిల్లులు మాత్రం చెల్లించలేదు.


మట్టిని అమ్మేసుకున్న ‘అధికారం’

విస్తరణలో భాగంగా వచ్చిన మట్టిని నిల్వ చేసుకోవడానికి భూమి సేకరించాల్సి ఉంది. ఈ విషయం గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. ప్రభుత్వ భూముల్లో తవ్విన మట్టిని అక్కడే కుప్పలుగా పోశారు. దీనిపై అక్రమార్కుల కన్ను పడింది. నంద్యాల పట్టణం ప్రథమనంది, పాణ్యం మండలం మద్దూరు, తొగర్చేడు ప్రాంతాల్లోని మట్టిని అధికార పార్టీ నాయకుల అండతో కొంతమంది అక్రమంగా తరలించి రూ.కోట్లు గడించారు.


2.73  ఎకరాల సేకరణ

- డేరంగుల చిన్నవెంకటసుబ్బయ్య

జొలదరాశి జలాశయం నిర్మాణానికి నాకున్న 2.73 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చాను.  ఎకరాకు రూ.18 లక్షలు పరిహారంగా ఇస్తామన్నారు. భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ తీసుకున్నారు. ఏడాదిన్నర దాటినా పరిహారం ఇవ్వలేదు. డబ్బులు వస్తాయనే నమ్మకంతో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేశాను. వడ్డీలు పెరుగుతున్నాయి.


వెక్కిరిస్తున్న శిలాఫలకం

కుందూనదిపై కోవెలకుంట్ల మండలంలో జొలదరాశి, చాగలమర్రి మండలంలో రాజోలి ప్రాజెక్టులను నిర్మించాలని నాలుగేళ్ల కిందట ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. భూసేకరణకు ఎకరాకు రూ.14.75 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు చెల్లిస్తామని ప్రకటించారు. భూములు తీసుకున్న వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ చేసేస్తామని అధికారులు చెప్పగానే సంతకాలు పెట్టారు. రెండేళ్ల కిందట పట్టాపాసు పుస్తకాల నకళ్లు తీసుకున్నారు. ఇప్పటికీ పైసా రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని