logo

దాచిన సొమ్ము దోచుకున్నారు

పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు.

Published : 20 May 2024 01:15 IST

మోసాలకు పాల్పడుతున్న తపాలా ఉద్యోగులు 

శ్రీరంగాపురం తపాలా కార్యాలయం

ఆళ్లగడ్డ, రుద్రవరం, న్యూస్‌టుడే: పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. ఎన్నో ఆశలతో కూడబెట్టుకున్న పేదోళ్ల సొమ్ముపై రాబందుల్లా పడి దోచేస్తున్నారు. దాచుకుంటే సొమ్ముకు భద్రత ఉందనుకునే వారి నమ్మకాలను వమ్ము చేస్తున్నారు. పోస్టాఫీసులు ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైన ఉంది. మరి వారెలా స్పందిస్తారో చూడాల్సిందే. తాజాగా రుద్రవరం మండలం శ్రీ రంగాపురంలో బీబీఎంగా పనిచేస్తున్న శరత్‌నాయక్‌ ప్రజలకు చెందిన ఆర్డీ, పోస్టల్‌ సేవింగ్స్‌కు సంబంధించిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి పక్కదారి పట్టించారని స్థానికులు గగ్గోలుపెడుతున్నారు. బీబీఎంగా ఏడాది కిందటే విధుల్లో చేరిన ఆయన దాదాపు ఈ పోస్టాఫీసు పరిధిలో ఇప్పటివరకు 62 మంది ఖాతాదారులకు చెందిన రూ.3,48,211 పక్కదారి పట్టించినట్లు విచారణలో తేలింది.

బయటపడిందిలా

శ్రీ రంగాపురం బ్రాంచ్‌ పోస్టాఫీసు పరిధిలో శ్రీరంగాపురం, డి.కొట్టాల, టి.కొట్టాల గ్రామాలు వస్తాయి. టి.కొట్టాలకు సంబంధించిన ఒక ఖాతాదారు ఐదేళ్ల పాటు ఆర్డీ కట్టిన తర్వాత డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. బీబీఎం శరత్‌ నాయక్‌ మాత్రం ఆర్డీ పుస్తకాలు ఖాతాదారుకు ఇవ్వకుండా వేధించారు. అనుమానం వచ్చిన ఖాతాదారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి విచారించగా ఏడాది నుంచి ఖాతాదారు అక్కౌంట్‌లో డబ్బులు జమ కావడం లేదని తేలింది. తాను నెల నెలా బీబీఎంకు డబ్బులు ఇస్తున్నానని ఆయన చెప్పారు. లోతుగా విచారించగా ఖాతాదారుల నుంచి డబ్బులు తీసుకుని పోస్టాఫీసులోని ఖాతాల్లో బీబీఎం జమ చేయకుండా పక్కదారి పట్టించినట్లు నిరూపణ అయ్యింది. ఇప్పటివరకు శ్రీ రంగాపురానికి చెందిన వారి నుంచి మాత్రమే వివరాలు సేకరించారు. ఇంకా ఎస్‌.కొట్టాల, టి.కొట్టాల గ్రామాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తే బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. తమ సొమ్ము పోస్టాఫీసులో అయితే భద్రంగా ఉంటుందని ఇక్కడ పొదుపు చేస్తే ఖాతాల్లో సిబ్బంది జమ చేయకపోవడంతో మోసపోయామని బాధితులు వాపోతున్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు

ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలో పడకండ్ల గ్రామంలో ఒక బీబీఎం ఖాతాదారులకు చెందిన రూ.65 వేలను జమ చేయకుండా సొంతానికి ఉపయోగించుకున్నారు.

  •  ఆళ్లగడ్డ మండలంలోని ఆర్‌.కృష్ణాపురానికి చెందిన బీబీఎం ఒకరు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పే ఆర్డరు నకిలీ కాపీలను సృష్టించి డబ్బులను విత్‌డ్రా చేసుకున్న ఘటన జరిగింది.
  • నందికొట్కూరు పరిధిలోని మల్యాల గ్రామ పోస్టాఫీసు పరిధిలో పొదుపు ఖాతాదారులకు చెందిన రూ.1.20 లక్షల సొమ్మును బీబీఎం పక్కదారి పట్టించారు.

కూడబెట్టిన సొమ్ము తినేశారు

నెలకు రూ.200 చొప్పున ఆర్డీ కట్టాను. ఎంతో కష్టపడి పొదుపు చేసిన సొమ్ము మరో నెలలో నా చేతికందుతుందని భావిస్తుంటే ఈ లోగా సొమ్మును ఖాతాలో వేయకుండానే పక్కదారి పట్టించారు. నేను చెల్లించిన సొమ్ముకు ఎవరు జవాబుదారీ వహిస్తారు. డబ్బుల్ని పూర్తిగా అధికారులు చెల్లించాలి.

 వెంకటసుబ్బమ్మ, శ్రీరంగాపురం

నెలకు రూ.వెయ్యి చెల్లించాను

నెలకు రూ.1000 చొప్పున ఆర్డీ(రికరింగ్‌ డిపాజిట్‌)లో పొదుపు చేశాను. 9 నెలలుగా నా ఖాతాలో డబ్బు జమ కాలేదు. పోస్టాఫీసులో డబ్బు భద్రంగా ఉంటుందని భావించాను. కానీ ఇక్కడ కూడా ఇలా మోసం జరగడంతో మా వంటి పేద, మధ్య తరగతి వారు డబ్బులు ఎక్కడ పొదుపు చేయాలో అర్థం కాని స్థితి నెలకొంది.

 వెంకటసుబ్బయ్య, శ్రీరంగాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని