logo

నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు

భూముల ధరలు పెరుగుతండటంతో స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను నట్టేట ముంచుతున్నారు.

Updated : 23 May 2024 06:06 IST

ఓ వెంచర్‌లో రాళ్లు తొలగిస్తున్న పుర అధికారులు

కల్వకుర్తిపట్టణం, న్యూస్‌టుడే : భూముల ధరలు పెరుగుతండటంతో స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను నట్టేట ముంచుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందుతూ ఎలాంటి సౌకర్యాలు లేకున్నా రూ. లక్షల ధర నిర్ణయించి ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అంటగడుతూ మోసాలకు తెరలేపుతున్నారు. గోరంత అనుమతి తీసుకుని కొండంత వెంచర్‌గా మార్చి విక్రయాలు చేస్తున్నారు. అనుమతులు పొందే సమయంలో 10శాతం భూమిని చూపిస్తూ తర్వాత విక్రయాలు చేస్తున్నారు. తమ అక్రమ వ్యాపారాలు సక్రమంగా సాగించుకునేందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నియోజకవర్గ కేంద్రాలైన నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ పురపాలికలతో పాటు శివారు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 
రికార్డులు కనుమరుగు.. :  సుమారు 10సంవత్సరాల క్రితం జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాలు పంచాయతీల నుంచి పురపాలిక సంఘాలుగా మారాయి. అప్పట్లో ఎలాంటి అభివృధ్ధి చేయకున్నా వెంచర్లకు అనుమతులు ఇచ్చారు. వాటికి సంబంధించి దస్త్రాలు పూర్తిగా కనుమరుగు చేశారు. పురపాలికగా ఏర్పడ్డాక గత ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి 10శాతం భూమిని ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలనే నిబంధన తేవడంతో కొంత మార్పు వచ్చింది. గతంలో నిర్మించిన అక్రమ వెంచర్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించినా ముందుకు రాలేదు. అక్రమమని ఉన్నతాధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రపు చర్యగా రాళ్లు తొలగించి చేతులు దులుపుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి యథావిధిగా రాళ్లు పాతుకుంటున్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఓ సర్వేనంబంలో 2007సంవత్సరంలో రెండు ఎకరాలకు అనుమతి తీసుకుని 4ఎకరాల వెంచర్‌ చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో పుర అధికారులు చర్యలు చేపట్టారు. కల్వకుర్తి పట్టణాన్ని అనుసరించి ఉన్న కుర్మిద్ద శివారులో ఒకే పేరుతో సుమారు 50ఎకరాల్లో వెంచర్‌ నిర్మించారు. దాని ద్వారా పంచాయతీకి సుమారు మూడు ఎకరాల స్థలం కేటాయించాలి. ఇలా తాండ్ర, కొట్ర, మార్చాల శివారులో పదుల సంఖ్యలో వెంచర్‌లను వందల ఎకరాల్లో నిర్మించారు. అందులోని పంచాయతీలకు చెందిన 10శాతం భూమిని పాలకులు, వ్యాపారులు అధికారుల సహకారంతో విక్రయించుకుని ఆదాయం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పదిశాతం భూమిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈవిషయమై టీపీవో విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. పురపాలిక పరిధిలోని వెంచర్లలో 10శాతం ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగిందని, అక్రమ వెంచర్‌లను గుర్తించి రాళ్లు తొలగించామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు