logo

గెలుపు బాధ్యత కార్యకర్తలదే

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి.

Updated : 19 Apr 2024 06:38 IST

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌

ధన్వాడ, నర్వ, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందు నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు చిట్టెం పర్నికరెడ్డి, వాకిటి శ్రీహరిలకు ఎలాంటి హోదాలు లేవని, ప్రజలు అభిమానించబట్టే వారు ఈ రోజు అభివృద్ధి పనులు చేయగలుగుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు బిడ్డకు మరింత పేరు రావాలంటే మహబూబ్‌నగర్‌లో లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ సాధించాలన్నారు. ఇక్కడ మంచి మెజారిటీ ఇస్తే ఉమ్మడి ధన్వాడ మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానన్నారు. 22 రోజులు కష్టపడి గెలిపిస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటానన్నారు. ముఖ్యంగా ధన్వాడకు డిగ్రీ కళాశాల సొంత భవనాలు, మరికల్‌కు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు చేయిస్తానన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో నామినేషన్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తున్నారని, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యేలు చిట్టెం పర్నికరెడ్డి, వాకిటి శ్రీహరిలు మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ ముగియగానే ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇండ్లను అర్హులకు అందజేస్తామన్నారు. పేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి  మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో గెలుపును బహుమతిగా ఇద్దామన్నారు. మహబూబ్‌నగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి,. నాయకులు కుంభం శివకుమార్‌రెడ్డి, మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు రాబట్టాలని కార్యకర్తలను కోరారు. ధన్వాడ, మరికల్‌, నర్వ కాంగ్రెస్‌ పార్టీ మండలశాఖ అధ్యక్షులు నరహరి, వీరన్న, చెన్నయ్య సాగర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో శివకుమార్‌, ప్రసన్నరెడ్డి, వెంకట్రామారెడ్డి, కవిత, శేఖర్‌రెడ్డి, రవినాయక్‌, నిరంజన్‌రెడ్డి, బాలకృష్ణ, ఎండీ గౌస్‌, కృష్ణయ్య, హరీష్‌కుమార్‌, పోలీసు చంద్రశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ గౌని జ్యోతి, బాలకిష్టారెడ్డి, జగదభిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని