Chennai Vs Punjab: ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్‌

మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్‌ టాస్‌ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు.

Updated : 02 May 2024 10:40 IST

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై జట్టుకు తన సొంతమైదానం చెపాక్‌లో మళ్లీ ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్‌ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ ఈ పరాజయం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై (162/7) భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (62) కీలక ఇన్నింగ్స్‌ ఆడినా సరిపోలేదు. కనీసం మరో 50 నుంచి 60 పరుగుల వరకు చేస్తే బాగుండేదని రుతురాజ్‌ (Rutursj Gaikwad) వ్యాఖ్యానించాడు. 

‘‘చెపాక్‌ స్టేడియంలో మళ్లీ ఓటమి ఎదురు కావడం నిరుత్సాహానికి గురి చేసింది. కనీసం మరో 60 పరుగుల వరకు అదనంగా చేయాల్సింది. మేం బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పిచ్‌ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. మతీశా పతిరన, తుషార్‌ దేశ్‌పాండే లేకపోవడం కూడా నష్టం చేసింది. వికెట్ కావాల్సిన సమయంలో కేవలం ఇద్దరు పేసర్లతోనే బౌలింగ్‌ చేయాల్సిన పరిస్థితి. మంచు ప్రభావం వల్ల స్పిన్నర్లకు బంతిపై నియంత్రణ ఉండదు. వారి నుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు. గత మ్యాచ్‌లోనూ మేం భారీ తేడాతో (78 పరుగులు) హైదరాబాద్‌పై గెలవడం కూడా మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తేమను మనం కంట్రోల్‌ చేయలేం. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకాస్త బెటర్‌గా బ్యాటింగ్‌ చేస్తే బాగుండేది. గత రెండు మ్యాచుల్లో మేం 200+ స్కోరును చేసి ప్రత్యర్థి ముందు ఉంచాం. ఇప్పుడీ మ్యాచ్‌లో కనీసం 180 రన్స్‌ ఉంచినా లక్ష్య ఛేదన క్లిష్టంగా మారేది. టాస్‌ కూడా కలిసి రావాలి. అందుకోసం నేను టాస్‌ వేయడాన్ని కూడా చాలాసార్లు ప్రాక్టీస్‌ చేశా. అక్కడ కొన్నిసార్లు విజయవంతమయ్యా. ఇక్కడ మాత్రం అనుకూలంగా రాలేదు. గేమ్‌లో పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ టాస్‌ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యా’’ అని రుతురాజ్‌ వెల్లడించాడు. గత మ్యాచ్‌ (హైదరాబాద్‌తో పోరు) సందర్భంగా పతిరన, తుషార్ దేశ్‌ పాండే గాయపడటంతో వారిద్దరికి జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఐపీఎల్‌లో 2014 నుంచి అతిపెద్ద వయసులో అరంగేట్రం చేసిన రెండో ఆటగాడు రిచర్డ్ గ్లీసన్. చెన్నై తరఫున రిచర్డ్‌ 36 ఏళ్ల 151 రోజుల వయసులో డెబ్యూ చేశాడు. అంతకుముందు సికిందర్ రజా (36 ఏళ్ల 342 రోజులు) అందరి కంటే ముందున్నాడు.
  • ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై 10 మ్యాచ్‌లు ఆడింది. కెప్టెన్ రుతురాజ్‌ తొమ్మిది సార్లు టాస్‌ను ఓడిపోయాడు. 
  • చెపాక్‌లో చెన్నైపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా పంజాబ్‌ నిలిచింది. ముంబయి (5) ముందుండగా.. పంజాబ్ (4) రెండో స్థానంలోకి వచ్చింది. కోల్‌కతా (3) ఆ తర్వాత ఉంది.
  • ఐపీఎల్‌లో చెన్నైపై వరుస విజయాలు సాధించిన ముంబయి జట్టుతో పంజాబ్‌ సమంగా నిలిచింది. ముంబయి (2018-19 సీజన్లలో) వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. ఇప్పుడు పంజాబ్‌ (2021-2024)  కూడా ఐదు విజయాలతో నిలిచింది.
  • అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ రుతురాజ్‌ గైక్వాడ్ వద్దకు చేరింది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ (500 రన్స్) ఉన్న క్యాప్‌ను రుతురాజ్‌ (509) సొంతం చేసుకున్నాడు. గత 9 మ్యాచుల వరకు కోహ్లీ వద్దే ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని