logo

ఐదేళ్లకు ఓ పూట

సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది...

Updated : 29 Apr 2024 06:34 IST

సమయం లేదా మిత్రమా
ఓటర్లు పెరిగి పోలింగ్‌ తగ్గుతున్న వైనం

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయడానికి ఓ పోలింగ్‌కేంద్రంలో నిలుచున్న మహిళలు

సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... అలాంటిది ఐదేళ్లకోమారు వేసే ఓటుపై మాత్రం ఎంతో అనాసక్తత ప్రదర్శిస్తున్నారు... ఆ కొన్ని గంటల మన నిర్లక్ష్యం మూలాన ప్రజాభిప్రాయం సరిగా ప్రతిఫలించట్లేదని గుర్తించాలి..

న్యూస్‌టుడే, గద్వాల న్యూటౌన్‌, ఊట్కూరు: ఉమ్మడి జిల్లాలో ఓటింగ్‌కు దూరమయ్యేవారు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో తొలి, రెండోదశ లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. చాలా రాష్ట్రాల్లో 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోంది. కేరళలో 2019లో 77.67 శాతం నమోదవగా, ప్రస్తుతం 65.91 శాతం మాత్రమే నమోదయ్యింది. రాజస్థాన్‌లో 66.34 శాతం నుంచి 64.07 శాతానికి తగ్గింది. తమిళనాడులో 72.44 శాతం నుంచి 69.72 శాతానికి తగ్గింది. కొత్త ఓటర్లు పెరుగుతున్నా.. ఓట్లేసే వారి సంఖ్య తగ్గుతోంది. మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఈ తరహా పరిస్థితులు గత లోక్‌సభ ఎన్నికల్లో చూశాం.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గత ఎన్నికల్లో 11.12 లక్షల మంది దూరం 2009 ఎన్నికల్లో 9.32 లక్షల మంది ఓటు వేయలేదు. వీరిలో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 4.94 లక్షల మంది, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 4.38 లక్షల మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో 7.79 లక్షల మంది ఓటు వేయలేదు. 2019 ఏప్రిల్‌లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 11.12 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇందులో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 5.17 లక్షల మంది ఉంటే.. నాగర్‌కర్నూల్‌ పరిధిలో 5.95 లక్షల మంది ఉన్నారు. అత్యధికంగా యువత ఓటుకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.  ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పరిధిలో 16,80,417 మంది ఓటర్లు, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 17,34,773 మంది ఓటర్లున్నారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి దాదాపు 3.27 లక్షల మంది ఓటర్లు పెరిగారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడితేనే పోలింగ్‌ శాతం పెరగనుంది.

స్వీప్‌ దృష్టి సారిస్తేనే..

మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. స్వీప్‌(సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో అధికారులు, విద్యార్థులు, ఓటర్లు కలసి 5కే రన్‌ నిర్వహించడంతో పాటు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. మహిళా సంఘాలతో ర్యాలీలు, ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓటరు గైడ్‌ల పంపిణీ చేపడుతున్నారు. త్వరలోనే ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. వీటితో పాటు ఇంకా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడితేనే ఫలితం ఉంటుంది. యంత్రాంగం ఎంతచేసినా పౌరుడిగా మన బాధ్యత నెరవేర్చినప్పుడే ఫలితం ఉంటుంది. .

ఓటు వేసేలా చర్యలు : శాసనసభ ఎన్నికల్లో స్వీప్‌ ద్వారా చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఓటర్లలో అవగాహన, చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యాసంస్థలకు సెలవులు ఉండటం కొంత ఇబ్బందిగా ఉంది. బీడీ కార్మికులు, మహిళా సంఘాలు, ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. యువతపై దృష్టి పెట్టాం.

రమేశ్‌బాబు, జ్యోతి, స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారులు, గద్వాల, నారాయణపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని