BJP: సీఎం రేవంత్‌ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ

సీఎం రేవంత్‌రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.

Published : 06 May 2024 15:05 IST

మహబూబ్‌నగర్‌: సీఎం రేవంత్‌రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను సీఎం ఎక్కడా ప్రస్తావించడం లేదని విమర్శించారు. ఓట్ల కోసం మళ్లీ కొత్త కొత్త మాటలతో ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. 

‘‘ రేవంత్‌ వచ్చినప్పుడల్లా నన్ను అవమానించేలా మాట్లాడుతున్నారు. నన్ను చూస్తే ఆయనకు ఎందుకు కడుపు మంట? ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆయన ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ తీరును ప్రజలు హర్షించరు. అదృష్టవశాత్తు రేవంత్‌ సీఎం అయ్యారు. అధికారంతో విర్రవీగితే కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుంది. 60 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న కుటుంబం నాది. తండ్రిని, సోదరుడిని కోల్పోయినా వెనక్కి తగ్గలేదు. మహబూబ్‌నగర్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నీరందేలా డీపీఆర్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తే... కేంద్రం నుంచి పాలమూరు-రంగారెడ్డికి నిధులు తీసుకొస్తా. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా పాలమూరు-రంగారెడ్డిపై ముఖ్యమంత్రి సమీక్ష జరపలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ఏమైంది? టెట్, డీఎస్సీ రుసుములు ఎందుకు పెంచారు?’’ అని డీకే అరుణ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని