logo

ప్రజలను వంచించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కరసింగ్‌ ధామి ఆరోపించారు.

Published : 07 May 2024 03:23 IST

ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కరసింగ్‌ ధామి

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : తెలంగాణలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కరసింగ్‌ ధామి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్‌లో మేధావులతో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఐదు మాసాల క్రితం అధికారంలోకి వచ్చిందని, ఒక్క హామీని కూడా అమలు చేయని ముఖ్యమంత్రి లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఎలా ఓట్లు అడుగుతారో మేధావులు ఆలోచించాలన్నారు. మహిళలను గౌరవించటం మన సంప్రదాయమని, భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణను మహిళ అని కూడా చూడకుండా సీఎం అవమానపరచడం సరికాదన్నారు. దేశంలోని యావత్‌ ప్రజానీకం భాజపా వైపు చూస్తోందని, మోదీ మూడోసారి ప్రధాని కావాలన్న చర్చ జరుగుతోందని తెలిపారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా వేగంగా పురోగమిస్తోందన్నారు. ప్రపంచాన్ని గడగడలాండించిన కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందించేందుకు మోదీ తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందన్నారు. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని, ఇందుకు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ ఓటర్లు అండగా నిలవాలని కోరారు. సమావేశంలో భాజపా పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌ఛార్జి ఏవీఎన్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని