logo

ఐదునెలల్లో పాతరోజులు తీసుకొచ్చారు: మన్నె

తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్‌నగర్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం బోయపల్లి, గ్రామీణ మండలం జైనల్లీపూర్‌, లాల్యానాయక్‌ తండాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రచారం చేశారు.

Published : 08 May 2024 02:58 IST

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్‌నగర్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం బోయపల్లి, గ్రామీణ మండలం జైనల్లీపూర్‌, లాల్యానాయక్‌ తండాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రచారం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్ల కేసీఆర్‌ పాలనలో విద్యుత్తు కోతలు, సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు మాసాల్లోనే ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులను తీసుకొచ్చిందన్నారు. సాగునీటి సమస్య, విద్యుత్తు కోతల వల్ల యాసంగి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని, కేసీఆర్‌ పాలనలో ఈ సమస్యలు ఉన్నాయా అని మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక సాకులు చెబుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాసను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కెట్‌ మాజీ ఛైర్మన్‌ ఆంజనేయులు, భారాస మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచులు యాదయ్య, గోపీనాయక్‌, ప్రతాప్‌నాయక్‌, నాయకులు రవీందర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.


దేశంలో కులగణన చేపడతాం : జూపల్లి

చిన్నంబావి, న్యూస్‌టుడే : కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేపట్టి కులాల వారీగా రిజర్వేషన్లు పెంచుతామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మండలంలోని పెద్దదగడలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని పేర్కొన్నారు. కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన గ్యారంటీల గురించి పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలని సూచించారు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలతా రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, నాయకులు రాంచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్‌, కల్యాణ్‌ రావు, చిదంబర్‌ రెడ్డి, బీచుపల్లి, తదితరులు పాల్గొన్నారు.


వర్గీకరణ వ్యతిరేక పార్టీలను వెళ్లగొడదాం: మందకృష్ణ

అయిజ, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పార్టీలను పారదోలే సమయం ఆసన్నమైందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం అయిజలో ఏర్పాటు చేసిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 ఏళ్లుగా వర్గీకరణ చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో భారాస పార్టీ మాదిగలకు తీరని అన్యాయం చేసిందన్నారు. తెలంగాణలో మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు అయితే కాంగ్రెస్‌ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. భాజపా మూడింటిలోనూ మాదిగలకు అవకాశం ఇచ్చిందన్నారు. వర్గీకరణపైనా కేంద్రం కమిటీ వేసిందన్నారు. మాదిగల ఆత్మగౌరవం, వర్గీకరణ సాధించుకోవాలంటే భాజపా తరపున బరిలో ఉన్న భరత్‌ప్రసాద్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదిగలపై ఉందన్నారు. భాజపా హయాంలోనే మాదిగలకు న్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి మురుగన్‌ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను గెలిపించి మాదిగల భవిష్యత్తుకు మంచి పునాది వేద్దామని అభ్యర్థి భరత్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. మాదిగల ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్‌, భారాస కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మండల, పట్టణాధ్యక్షులు గోపాలకృష్ణ, నరసింహయ్యశెట్టి, తదితరులు పాల్గొన్నారు.


పార్లమెంట్‌లో పాలమూరు గొంతుకనవుతా

పాలమూరు, మహబూబ్‌నగర్‌ గ్రామీణం:  ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్‌లో పాలమూరు గొంతుకనవుతానని కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో ఏనుగొండ, బండమీదిపల్లి, బీకేరెడ్డికాలనీ, భగీరథ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేలా కృషిచేస్తానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసను ఇంటికి పంపించినట్లే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు.  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు పాలమూరు ప్రజలంతా తమ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సమావేశంలో మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ఓబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ గౌడ్‌, పుర ఛైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, వైస్‌ ఛైర్మన్‌ షబ్బీర్‌ అహ్మద్‌, పుర మాజీ ఛైర్‌పర్సన్‌ రాధ, నాయకులు ఎన్పీ వెంకటేశ్‌, సురేందర్‌రెడ్డి, ఏపీ మిథున్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, లక్ష్మణ్‌యాదవ్‌, అవేజ్‌, ప్రశాంత్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


ఆదరణ చూసి ఓర్వలేక సీఎం అబద్ధాలు: డీకే అరుణ

కోస్గి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాజపాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని మహబూబ్‌నగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టులకు తాను అడ్డుపడినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఎక్కడి నుంచో వచ్చి కొడంగల్‌ ప్రజలను బతిమాడి గెలిచిన రేవంత్‌రెడ్డి, ఈ ప్రాంత ఆడపడుచునైన తనను విమర్శించడం తగదని హితవు పలికారు. మంగళవారం రాత్రి కోస్గిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె ప్రసంగించారు. శాసనభస ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రేమతో కాకుండా కేసీఆర్‌పై కోపంతో ప్రజలు ఓట్లేస్తేనే రేవంత్‌రెడ్డి మఖ్యమంత్రి అయ్యారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణరెడ్డి అన్నారు. ఆయన మోసకారి మాటలను కామారెడ్డి ప్రజలు నమ్మలేదన్నారు. ఈ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌ కుమ్మక్కై డ్రామాలు ఆడుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. అభివృద్ధి కావాలంటే కేంద్రంలో భాజపా అధికారంలో ఉండాలని, మరోసారి మోదీని ప్రధానిని చేసేందుకు భాజపాకు అండగా నిలవాలన్నారు. అరుణకు ప్రజలంతా మద్దతు పలకాలన్నారు. అంతకు ముందు కోస్గి పట్టణంలోని వివేకానంద కూడలి నుంచి రామాలయం మీదుగా శివాజీ కూడలి వరకు భాజపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగులపల్లి ప్రతాప్‌రెడ్డి, నియోజకవర్గ కోకన్వీనర్‌ కోటకొండ రాము, పార్టీ నాయకులు పాల్గొన్నారు.  


ప్రలోభాలకు లొంగకండి.. నచ్చిన నేతకు ఓటేయండి!

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ వ్యవసాయం: కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్‌ గ్యాచో భూటియా మంగళవారం హన్వాడ మండలంలో సందడి చేశారు. కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్‌ రంగస్వామి, ఇతర అధికారులతో గుడిమల్కాపూర్‌ గ్రామానికి వెళ్లారు. అక్కడి చెంచు కుటుంబాలకు చెందిన వృద్ధులు, మహిళలు, యువకులతో కలిసి కూర్చుని మాట్లాడారు. ప్రజాసామ్యంలో ఓటు చాలా విలువైందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకుని 100 శాతం పోలింగ్‌కు సహకరించాలని కోరారు. ప్రలోభాలకు లొంగకుండా నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. పోలింగ్‌ చీటీల పంపిణీ, పోలింగ్‌ కేంద్రంలో వసతులు పరిశీలించారు. దాదాపు గంటసేపు గ్రామస్థులతో మమేకమైన షెవాంగ్‌ గ్యాచో భూటియా ఓ బాలుడితో ఇలా సరదాగా ఆడుకున్నారు.  


మంచి భవిష్యత్తు కోసం ఆదరించి గెలిపించండి

భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

తెలకపల్లి,న్యూస్‌టుడే: ఈ ప్రాంతం బిడ్డగా ఇక్కడి ప్రజలు మంచి భవిష్యత్తు కోసం ఆదరించి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓటర్లను అభ్యర్థించారు. మండల కేంద్రంలో మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, నేత నాగం శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి రోడ్డు షో నిర్వహించారు. మండల సముదాయం నుంచి, ప్రధాన కూడలి మీదుగా అంబేడ్కర్‌ కూడలి వరకు భారాస శ్రేణులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ పుట్టబోయే బిడ్డ నుంచి ప్రతి ఒక్కరి సమస్యలపై పరిష్కారం దిశగా పార్లమెంటులో గొంతెత్తి మాట్లాడుతానన్నారు. అబద్దాల కాంగ్రెస్‌ను నమ్మొదని, ఆరు గ్యారంటీలు అమలు చేయలేక పోగా సీఎం రేవంత్‌రెడ్డి సభల్లో దేవుడిపై ఓట్టేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. అబద్దాలు మాట్లాడే వారే దేవుడిపై ఓట్లు వేస్తారన్నారు. తాను నిజం మాట్లాడుతానని తనకు ఏ ఒట్టు వేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరి పిల్లల భవిష్యత్తు కోసం పని చేస్తానన్నారు. ఎంపీటీసీలు లక్ష్మమ్మ, రమేశ్‌, పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని