logo

నల్లమలలో పెరిగిన ఓటింగ్‌

నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్నికల సిబ్బంది చెంచు పెంటలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి పోలింగ్‌ను విజయవంతం చేశారు. నల్లమలలోని ఆగర్లపెంటకు రెండు కి.మీ. దూరం కాలినడకన అటవీ ప్రాంతంలో ప్రయాణించి అక్కడే బస చేసి భయం గుప్పిట్లో కాలం గడిపారు.

Updated : 17 May 2024 05:48 IST

పోలింగ్‌ అధికారులు, సిబ్బంది చొరవతో 1.83 శాతం పెరుగుదల

నల్లమలలోని రాంపూరుపెంటలో ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న చెంచులు

న్యూస్‌టుడే, అచ్చంపేట: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్నికల సిబ్బంది చెంచు పెంటలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి పోలింగ్‌ను విజయవంతం చేశారు. నల్లమలలోని ఆగర్లపెంటకు రెండు కి.మీ. దూరం కాలినడకన అటవీ ప్రాంతంలో ప్రయాణించి అక్కడే బస చేసి భయం గుప్పిట్లో కాలం గడిపారు. బిక్కుబిక్కు మంటూ గుడిసెలో నిద్రించి ఉదయం పోలింగ్‌ ప్రక్రియను ఆ గుడిసెలోనే నిర్వహించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో నలుగురు వంతున 16 కేంద్రాల్లో 64 మంది పోలింగ్‌ అధికారులు విధులు నిర్వహించారు. పెద్ద పులులు, ఇతర క్రూర జంతువులు సంచరించే అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల్లో పోలింగ్‌ను విజయవంతం చేసిన సిబ్బందిని అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. అటవీ ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రాల్లో మహిళలు కూడా విధులు నిర్వహించడం విశేషం. విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో సౌరవిద్యుత్తు పరికరాలు అమర్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు, ఇతర అధికారులు విధులు నిర్వహించి పోలింగ్‌ విజయవంతం కావడానికి సహకరించారని ఆర్డీవో, అదనపు ఎన్నికల అధికారి మాధవి తెలిపారు.

గీసుగండిలో వంద శాతం

నల్లమల లోతట్టు అటవీ ప్రాంతం పదర మండలంలోని గీసుగండిలో అత్యధికంగా వందశాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 8 మంది పురుషులు, 15 మంది మహిళలు మొత్తం 23 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్లమల పరిధిలో మొత్తం 16 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 50-70 శాతం మధ్య 9, 70-80 శాతం మధ్య మూడు, 80-100 శాతం మధ్య నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో చెంచులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆగర్ల పెంటలో 92.86 శాతం, సంగిడిగుండాలలో 81.82 శాతం, ఎర్రపెంటలో 80.24 శాతం, రాయలేటిపెంటలో 84.38 శాతం పోలింగ్‌ నమైదైంది. ఫరహాబాద్‌లో అతి తక్కువగా 50 శాతం పోలింగ్‌ నమోదైంది.

అసెంబ్లీ కంటే అధికం..

నల్లమల అటవీ ప్రాంతంలోని ఆదిమజాతి చెంచులు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన చెంచులు ప్రస్తుతం రెండోసారి సొంత పెంటల్లోనే ఓట్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెంచు పెంటల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి చెంచులు నివాసం ఉండే చోటనే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో అప్పట్లో ఈ విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు అప్పట్లో లింగాల, అమ్రాబాద్‌ మండలాల తహసీల్దార్లపై వేటు వేసి కొరడా ఝుళిపించింది. ఉన్నతాధికారులు స్పందించి కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి నల్లమల ప్రాంతంలో వారు నివాసం ఉంటున్న చెంచుపెంటËల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. చెంచులు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెంచులు 66.43 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో 68.26 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో 1.83 శాతం ఓటింగ్‌ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో లింగాల మండలంలో 9, అమ్రాబాద్‌ మండలంలో ఐదు, పదర మండలంలో రెండు వంతున మొత్తం 16 పోలింగ్‌ కేంద్రాలను లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల్లో ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం అదనంగా మరో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని