logo

తీరని నష్టం.. సాగుకు కష్టం

చెరువు కట్ట నాసిగా నిర్మించడంతో పూర్తిగా నిండకముందే కోసుకుపోయి రైతుల పొలాలన్నీ నీట మునిగి ఇసుక పాలయ్యాయి. పదుల సంఖ్యలో రైతులు నష్టపోయారు. ఇసుక మేట వేయగా.. దాన్ని పూర్తిగా తొలగిస్తేనే మరో పంట సాగుకు అవకాశం ఉంటుంది.

Published : 14 Aug 2022 01:46 IST

పొలాల దుస్థితి

చెరువు కట్ట నాసిగా నిర్మించడంతో పూర్తిగా నిండకముందే కోసుకుపోయి రైతుల పొలాలన్నీ నీట మునిగి ఇసుక పాలయ్యాయి. పదుల సంఖ్యలో రైతులు నష్టపోయారు. ఇసుక మేట వేయగా.. దాన్ని పూర్తిగా తొలగిస్తేనే మరో పంట సాగుకు అవకాశం ఉంటుంది. ఇది శివ్వంపేట మండలం రత్నాపూర్‌ గ్రామంలో అంబరెడ్డి చెరువు కట్ట తెగిపోవడంతో ఏర్పడిన పరిస్థితి.

న్యూస్‌టుడే, శివ్వంపేట

రత్నాపూర్‌ గ్రామంలోని అంబరెడ్డి అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. దీని ఆధారంగా 700 ఎకరాల వరకు సాగవుతోంది. 500 మంది రైతులు ఆధారపడ్డారు. అటవీ ప్రాంతంలో కురిసిన వాన నీరంతా ఇందులోకి చేరుతుంది. ఇటీవల కురిసిన వాన నీరంతా ఒక్కసారిగా రాగా.. తూముపై ప్రభావం పడింది. దీంతో కట్ట తెగిపోగా.. 17 మంది రైతులకు చెందిన 32 ఎకరాలు ఇసుక, మట్టి మేట వేసింది. ఏళ్లుగా సాగులో ఉన్న ఈ భూములకు ఎలాంటి పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడం గమనార్హం. గతంలో పన్నులు చెల్లించినా పాసుపుస్తకాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. అంబరెడ్డి చెరువును మిషన్‌ కాకతీయ రెండో విడతలో రూ.15 లక్షలతో బాగు చేశారు. అలుగు, కట్ట, తూములు నిర్మించి అభివృద్ధి చేపట్టారు. 15 మీటర్ల ఎత్తు, 30 మీటర్ల వెడల్పుతో కట్ట నిర్మించారు. ఆ పనులు నాసిగా చేపట్టడంతోనే ఇలా జరిగిందని స్థానికులు వాపోతున్నారు.

మేటలు తొలగిస్తేనే.. చెరువు కట్ట తెగడంతో నీరంతా 2 కి.మీ. దూరంలోని అల్లీపూర్‌ పెద్ద చెరువులోకి చేరింది. అంత దూరం వరకు 32 ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ఇక్కడ తిరిగి సాగు చేయాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఇసుక పూర్తిగా తొలగేవరకు ఇదే పరిస్థితి. ట్రాక్టర్లతో దున్నితే కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ అడవిలో నుంచి వస్తున్న వరద నేరుగా సాగు భూముల్లోకే పారుతోంది. వెెంటనే కట్ట నిర్మించి పైనుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయల్సిన అవసరం ఉంది. కట్ట మరమ్మతులకు రూ.50 లక్షలకు పైగా నిధులు అవసరమని అధికారుల అంచనా. గతంలో కట్టలో కర్రలు, చెట్ల కొమ్మలు వేసి మట్టి వేసినట్లు గుర్తించారు. నీటి ప్రవాహం ఉన్నన్ని రోజులూ ఎలాంటి మరమ్మతులు చేసేందుకు అవకాశం లేదని నీటిపారుదల ఏఈ సునీత తెలిపారు.

ప్రాణాపాయం తప్పింది..: ఊట్ల మలేశ్‌

నాకు చెరువు కట్ట తెగిన చోట ఆనుకుని మూడెకరాలు ఉండగా వరి నాటు వేశాం. సగం మేర ఇసుక మేట వేసింది. బోరు స్టార్టరు, కేబుల్‌ తీగ కొట్టుకుపోయింది. రాత్రి వేళలో కట్ట కోసుకుపోవడంతో ప్రాణాపాయం తప్పింది. శాశ్వత పరిష్కారం చూపాలి.

రెండెకరాలలో..: కాట్రోత్‌ లచ్చిరాం

చెరువు కింద రెండెకరాలలో వరి సాగు చేశాను. కట్ట కోసుకుపోయి పొలం పూర్తిగా ఇసుకతో నిండింది. చెరువులో నీరు నిల్వ ఉంటేనే బోర్లు నీరు పోస్తాయి. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని