logo

‘రాజీనామాలతో కొత్త నాటకం’

రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు.

Published : 27 Apr 2024 02:19 IST

నిజాంపేటలో భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు ప్రచారం

నిజాంపేట(రామాయంపేట): రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. నిజాంపేటలో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా ఉండి రూ.లక్ష రుణమాఫీ చేయని హరీశ్‌రావు.. రూ.రెండు లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి సవాలు విసరడం మీడియా దృష్టిని ఆకర్షించడానికేనన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రుణమాఫీ చేయనందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎం కేసీఆర్‌ రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్‌ హౌస్‌లో వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు.. మార్చి 19న దిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వస్తూ రాజీనామా నాటకానికి పథకం వేశారన్నారు. రుణమాఫీ చేయనందుకు అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి.. ఆ తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరాలని సూచించారు. రేవంత్‌రెడ్డి, హరీశ్‌ రావు ఇద్దరూ అనుకొని రోజు మీడియాలో వాళ్ల గురించే వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఇది అర్థమయ్యే లోపు హరీశ్‌రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్లిపోతారని అన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో భాజపాకు ఉన్న ఆదరణ తట్టుకోలేక భారాస, కాంగ్రెస్‌లు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్‌ విషయంలో తాము స్పష్టతతో ఉన్నామని, కాంగ్రెస్‌, భారాస అందుకు భిన్నంగా వారి విధానం విడదీయరాని బంధంగా ఉందన్నారు. ఓబీసీ, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ ఉండాలనేది భాజపా విధానమన్నారు. భాజపా ఏనాడూ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అనలేదన్నారు. ఈ సందర్భంగా పలువురు భాజపాలో చేరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, జడ్పీటీసీ సభ్యుడు విజయ్‌ కుమార్‌, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని