logo

గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు

గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలని వికాసానికి దోహదం చేస్తాయని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ ఆధ్వర్యంలో ‘సతత్‌ వికాస్‌’ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 24 Mar 2023 01:11 IST

‘సతత్‌ వికాస్‌’ పురస్కారాల ప్రదానం

ప్రశంసా పత్రాలను, శాలువాలను తిరిగి ఇస్తున్న సర్పంచులు బండి శ్రీనివాస్‌, ఆలేటి రజిత

న్యూస్‌టుడే - దుబ్బాక, చేర్యాల, జగదేవపూర్‌, గజ్వేల్‌ గ్రామీణ, మద్దూరు, రాయపోల్‌, ములుగు, దౌల్తాబాద్‌, మిరుదొడ్డి, రాయపోల్‌ హుస్నాబాద్‌ గ్రామీణ: గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలని వికాసానికి దోహదం చేస్తాయని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ ఆధ్వర్యంలో ‘సతత్‌ వికాస్‌’ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. తొమ్మిది విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామాలకు సంబంధిత ప్రతినిధులకు పురస్కారాలు అందించి సత్కరించారు. దుబ్బాకలో 13, జగదేవపూర్‌లో 15, గజ్వేల్‌ పరిధిలో 16, రాయపోలో మండలంలో 15, హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లో 27, మిరుదొడ్డిలో 13, దౌల్తాబాద్‌లో 27 గ్రామ పంచాయతీలతో పాటు చేర్యాల, మద్దూరు, ములుగు, మర్కూక్‌ తదితర మండలాలకూ అవార్డులు ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవోలు, సర్పంచులు, వార్డు సభ్యులు, తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీవోలు, మార్కెట్‌ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

మద్దూరులో రసాభాస : మద్దూరులో జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రథమ స్థానం దక్కాల్సిన వాటికి రాజకీయ పైరవీలతో ద్వితీయ, తృతీయ స్థానాలకు పరిమితం చేశారని ఆగ్రహిస్తూ తమకు ఇచ్చిన పత్రాలను, శాలువాలను తిరిగి అధికారులకు వాపసు ఇచ్చారు. ప్రశంసా పత్రాలు, సన్మానోత్సవ కార్యక్రమానికి మండలంలోని 23 గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. వల్లంపట్ల, బైరాన్‌పల్లి, బెక్కల్‌ గ్రామాల్లో పంచాయతీ, ప్రభుత్వ నిధులతో మిగతా గ్రామాల కంటే అభివృద్ధి చేసినప్పటికీ సెలెక్షన్‌ కమిటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా తమ గ్రామాలకు ద్వితీయ, తృతీయ స్థానాలు ప్రకటించినట్లు ఆయా గ్రామాల సర్పంచులు ఆలేటి రజిత, బండి శ్రీనివాస్‌, కూకట్ల బాల్‌రాజ్‌ విమర్శించారు. వల్లంపట్ల సర్పంచి భర్త యాదగిరి.. ఎంపీపీని సభలో నిలదీస్తుండగా ఆయనను అర్హత లేదంటూ బయటకు పంపించారు. ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూడాలని అధికారులకు ఎంపీపీ సూచించారు.

ములుగులో సర్పంచులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ఏఎంసీ ఛైర్మన్‌ జహంగీర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ అంజిరెడ్డి తదితరులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని