logo

పోషక భోజనం..ఆరోగ్య భాగ్యం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇక నాణ్యమైన, పోషకాలతో కూడిన భోజనం అందనుంది. ప్రతి రోజు ఆకు కూరలతోపాటు, వెజిటెబుల్‌ బిర్యానీ అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated : 09 Jun 2023 06:12 IST

న్యూస్‌టుడే, మెదక్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇక నాణ్యమైన, పోషకాలతో కూడిన భోజనం అందనుంది. ప్రతి రోజు ఆకు కూరలతోపాటు, వెజిటెబుల్‌ బిర్యానీ అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు ప్రారంభం కాగానే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. వేతనాలు సరిపోవడం లేదని, బిల్లులు సకాలంలో రావడం లేదని నిర్వాహకులు చేతులెత్తేస్తున్న క్రమంలో ప్రభుత్వం ఇకపై మధ్యాహ్నభోజన నిర్వహణకు అవసరమైన సామగ్రికి టెండర్‌ నిర్వహించాలని ఆదేశించింది. ప్రస్తుతం గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో ఈ విధానం అమలవుతుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో అమలు చేయనున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం పిల్లలకు వారానికి మూడు సార్లు గుడ్డు అందజేస్తుండగా, కూరలతో అన్నం వడ్డిస్తున్నారు. వేతనాలు రాక, బిల్లులు సకాలంలో అందకపోవడంతో నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో జిల్లాలో 129 పాఠశాలల్లో అక్షయ పాత్ర ద్వారా భోజనాన్ని అందిస్తున్నారు.

ఇక టెండర్‌ నిర్వహణ

ప్రస్తుతం గురుకుల, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అందించేందుకు అవసరమైన కూరగాయలు, పండ్లు, పాలు, మాంసాహారం, నిత్యావసర వస్తువులకు అధికారులు టెండర్లు నిర్వహించి వాటిని దక్కించుకున్న గుత్తేదారు సరఫరా చేస్తుంటారు. ఈ విధానాన్ని ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మెనూ అమలు చేయడంతో పాటు టెండరు దక్కించుకున్న గుత్తేదారు సరకులను సరఫరా చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందుకోసం అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు.

మార్పునకు శ్రీకారం

గత విద్యాసంవత్సరంలో అమలైన మెనూలో పలు మార్పులు చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి వారంలో ఒక రోజు మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ అందించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాల(1-5తరగతులు)ల్లో పిల్లలకు అన్నం వండి పెట్టినందుకు రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.5.45, ఉన్నత పాఠశాల(6-10 తరగతులు)ల్లో విద్యార్థులకు రూ.8.17 చొప్పున కూరగాయలు, ఇతర ఖర్చులకు చెల్లిస్తున్నారు. కొత్త విధానం అమలుతో జిల్లాలో లక్షకుపైగా విద్యార్థులకు మేలు జరగనుంది. పోషక విలువలతో కూడిన ఆహారం అందటం, ఆరోగ్యానికి దోహదపడుతుంది. కేంద్రం ప్రభుత్వం కొత్త విధానాన్ని నిర్దేశించటం బాగుందని, దీనిని సక్రమంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

చర్యలు చేపడతాం: రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి

మధ్యాహ్నభోజన నూతన మెనూను ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేయనున్నాం. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇస్తాం. మరోవైపు నిత్యావసర సరకులు, కూరగాయలను గుత్తేదారు సరఫరా చేయాలని ఆదేశాలున్నాయి. అప్పటి వరకు నిర్వాహకులతో భోజనాన్ని అందిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో టెండర్లను నిర్వహిస్తాం.


నూతన మెనూ ఇలా...

సోమ కిచిడీ, గుడ్డు

మంగళ అన్నం, సాంబారు

బుధ అన్నం, ఆకుకూరపప్పు, గుడ్డు

గురు వెజిçబుల్‌ బిర్యానీ

శుక్ర, శని అన్నం, ఆకుకూర పప్పు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని