logo

గడువు ముంగిట పనుల హడావుడి

పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు.

Published : 28 Mar 2024 02:01 IST

పర్యవేక్షణ లేక.. సీసీ రోడ్లలో నాణ్యత కరవు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

నందికందిలో పనులు

పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. ఈ లోగా ఎలాగైనా పూర్తి చేయాలని గుత్తేదారులు హడావుడిగా పనులు చేపడుతున్నారు. చాలా చోట్ల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సీసీ రోడ్ల నాణ్యత ప్రశ్నార్థకమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.

సగం చోట్ల పూర్తి

జిల్లాలో సంగారెడ్డి, అందోలు సబ్‌ డివిజన్ల పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు ఉపాధి హామీ పథకం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఫిబ్రవరి తొలి వారంలో జిల్లా కలెక్టర్‌ 829 పనులకు.. రూ.70.39 కోట్ల అంచనా నిధులకు ఆమోదం తెలిపారు. పల్లెల్లో సీసీ రహదారులకు రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు మంజూరయ్యాయి. రూ.5 లక్షలలోపు పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. ఆపై వాటికి టెండర్లు నిర్వహించారు. ఇప్పటి వరకు 418 సీసీ రోడ్ల పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 399 పనులు ప్రగతిలో ఉన్నాయి.

అందని గతేడాది బిల్లులు

జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా రూ.26.56 కోట్ల విలువైన పనులు చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లులు ఒక్క రూపాయైనా మంజూరు కాలేదు. గతేడాది చేపట్టిన పనుల బిల్లులు రూ.8కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. బిల్లుల చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతోనూ గుత్తేదారులు నాణ్యత విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

సీసీ రోడ్డు నిర్మాణ సమయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలి. పర్యవేక్షణ అధికారులు లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టానుసారంగా రోడ్లు వేస్తున్నారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు సిమెంట్‌, ఇసుక, కంకర కలపడం లేదనే విమర్శలొస్తున్నాయి. చాలా చోట్ల రాతిపొడిని అధికంగా వినియోగిస్తున్నారు. పనులకు ముందు రోడ్డును రోలర్‌తో చదునుగా మార్చాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. నీటి తడులు (క్యూరింగ్‌)నూ విస్మరిస్తున్నారు. ఈ నెలాఖరు లోగా పనులు పూర్తి చేయకుంటే నిధులు వెనక్కి వెళతాయనే ఉద్దేశంతో హడావుడిగా చేస్తున్నారనే విమర్శలున్నాయి.


క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..

- జగదీశ్వర్‌, పీఆర్‌ ఈఈ, సంగారెడ్డి

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రహదారుల పనులకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. ఈ లోగా పూర్తిచేసిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే బిల్లులు వస్తాయి. లేదంటే బిల్లులు రావు. గడువు సమీపించినప్పటికీ కచ్చితంగా పనుల్లో నిబంధనలు పాటించాల్సిందే. ఎక్కడైనా నాణ్యత పాటించకుండే ఫిర్యాదు చేయండి. విచారించి మళ్లీ పనులు చేయిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని