logo

ప్రకృతివనం భూమి ధారాదత్తం

చేగుంట మండలం అనంతసాగర్‌ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్‌ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు.

Published : 29 Mar 2024 03:22 IST

గుట్టుచప్పుడు కాకుండా టీఎస్‌ఐఐసీకి కేటాయింపు

చేగుంట మండలం అనంతసాగర్‌లో బృహత్‌ పల్లెప్రకృతివనంలో ఏపుగా పెరుగుతున్న చెట్లు

న్యూస్‌టుడే, చేగుంట: చేగుంట మండలం అనంతసాగర్‌ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్‌ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. నెల రోజుల పాటు జేసీబీలు ఏర్పాటు చేసి మట్టిరోడ్లు వేయటం, చదును చేయటం వంటి పనులు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా దీనిని అప్పనంగా టీఎస్‌ఐఐసీ(తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌)కు ధారాదత్తం చేశారు. దీనిపై వ్యతిరేకత వస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

25 వేల మొక్కలు

ప్రకృతివనంలో 25 వేల మొక్కలు నాటారు. వేప, అల్లనేరేడు, జామ, ఉసిరి, చింత, కానుక, దానిమ్మ.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. మూడేళ్లుగా ప్రతి రోజు నీటి తడులు అందించి పెంచారు. దీంతో చాలా మొక్కలు ఏపుగా పెరిగాయి. అందులోనే క్రీడాప్రాంగణం కూడా ఏర్పాటు చేశారు. చివరకు అధికారులు ఆ భూమిపై దృష్టి పెట్టి ఏడాదిగా ఓ పరిశ్రమ కోసం టీఎస్‌ఐసీసీకి అప్పగించాలని ప్రయత్నాలు చేశారు. ఇటీవలే ప్రక్రియ పూర్తయింది. ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 8.30 ఎకరాలను దానికి ధారాదత్తం చేసినట్లు తెలిసింది. దీనిపై అనంతసాగర్‌ గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండా ఎలా కేటాయిస్తారని, గుట్టుచప్పుడు కాకుండా చేయడంలో ఆంతర్యం ఏమిటని, పైగా ఏపుగా పెరిగిన చెట్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఓ పరిశ్రమకు కొమ్ముకాసేందుకే భూమిని టీఎస్‌ఐఐసీకి అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


గతంలోనే ప్రతిపాదనలు పంపారు
గియాస్‌ ఉన్నీసాబేగం, తహసీల్దారు, చేగుంట

బృహత్‌ పల్లెప్రకృతివనం భూమిని టీఎస్‌ఐఐసీకి కేటాయించే విషయం గతంలోనే జరిగింది. ఉన్నతాధికారుల సూచన మేరకు తిరిగి భూమిని రెవెన్యూ శాఖ ఆధీనం చేసుకోవడం జరిగింది. ఇటీవలే టీఎస్‌ఐఐసీకి కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని