logo
Published : 04/12/2021 04:19 IST

ఉపాధి ఆశలు

ఖనిజాధారిత పరిశ్రమల స్థాపనకు ఊతం

ఈనాడు, నల్గొండ: రాష్ట్రంలోనే అత్యధికంగా సున్నపురాయి నిక్షేపాలు, యురేనియం ఉన్న ప్రాంతంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పేరుగాంచింది. కృష్ణా నది పరివాహక ప్రాంతంతో పాటు దానికి ఆనుకునే ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో అపారమైన వజ్రం, బంగారం, గ్రానైట్‌ లాంటి విలువైన ఖనిజాలు ఉన్నాయని గతంలోనే పలు ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా ప్రభుత్వం జిల్లాల వారీగా వనరులపై నివేదిక రూపొందించి, ఎక్కడెక్కడ ఏ ఖనిజాలు లభ్యమవుతాయో, ఆ ప్రాంతంలో దానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే త్వరలోనే మరిన్ని గ్రానైట్‌, సిమెంటు పరిశ్రమలు రానున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమల స్థాపనలో ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే 19 సిమెంటు పరిశ్రమలుండగా... అందులో ప్రస్తుతం 14 పరిశ్రమలు సిమెంటును ఉత్పత్తి చేస్తున్నాయి. కృష్ణపట్టిలో ఉన్న సున్నపురాయి నిక్షేపాలన్నీ ఈ కంపెనీలే ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నాయి. మరోవైపు దశాబ్దంన్నర క్రితమే యూరేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (యూసీఐ) నల్లమలలో యూరేనియం శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేయగా.. ఇక్కడి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ ప్రతిపాదనపై యూసీఐ వెనక్కి తగ్గినా ఇప్పటికీ వారికీ పీఏ పల్లి మండలంలో బేస్‌ క్యాంప్‌ ఉంది. నెల నెలా ఇక్కడ పరీక్షలు చేసి నమూనాలను సేకరిస్తున్నారు. దేవరకొండ, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట, తుంగతుర్తి, చౌటుప్పల్‌, మునుగోడు, చింతపల్లి ప్రాంతాల్లో స్టోన్‌ క్రషింగ్‌ పరిశ్రమ ఏళ్లుగా నడుస్తోంది. దీని కింద అనేక మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో కాలుష్య కారకాన్ని కలిగించని మరిన్ని పరిశ్రమలు వస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కృష్ణా, మూసీ పరివాహకాల్లో బంగారు గనులు

కృష్ణా నదితో పాటు దానికి ఉపనది అయిన మూసీ పరివాహకంలో విలువైన బంగారు గనులున్నట్లు గతంలోనే ఓయూకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరివాహకంలో ప్రభుత్వ పరంగా తవ్వకాలు జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లోనూ కృష్ణ పట్టి బంగారు గనులకు నెలవన్నట్లే తేలింది. ప్రభుత్వం నల్గొండ జిల్లాలో బంగారం, వజ్రం, గ్రానైట్‌ ఖనిజాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక రూపొందించింది. దీంతో ఈ ప్రాంతంలో బంగారానికి సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో ఇది మరింత మందికి ఉపాధినిచ్చే మార్గంగా తయారుకానుంది. ఇప్పటికీ వేర్వేరు రంగాల్లో పరిశ్రమల స్థాపనకు పలువురు ముందుకు వస్తున్నా అనుమతుల మంజూరు విషయంలో జాప్యం జరగడంతో వారు వెనక్కి వెళుతున్నారు. సర్కారు 2015లో కొత్త పరిశ్రమలను స్థాపించే పారిశ్రామికవేత్తలకు ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులు మంజూరు చేయాలనే ఉద్దేశంతో టీఎస్‌ ఐపాస్‌కు అంకురార్పణ చేసింది. ఈ ఆరేళ్లలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 946 పరిశ్రమలు స్థాపించారు. వీటి ద్వారా 30,803 మందికి ఉపాధి కల్పించారు. టీ ప్రైడ్‌, టీ ఐడియా పథకాలతోనూ కొందరు పరిశ్రమల స్థాపన పట్ల మొగ్గు చూపుతున్నారు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలపై 15 శాతం రాయితీ కల్పిస్తుండగా...ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలకు 10 శాతం రాయితీ ఇస్తోంది. పెద్ద పరిశ్రమల స్థాపన విషయంలో సర్కారు మరింత రాయితీలు కల్పిస్తే మేలని పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని