logo

తెలంగాణ రైతులను పరామర్శించని కేసీఆర్‌: ఈటల

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాయం చేయకపోగా కనీసం పరామర్శించకపోవటం ఆయనకు కర్షకుల పట్ల ప్రేమ ఎంత ఉందో రాష్ట్ర ప్రజలు

Published : 25 May 2022 02:49 IST

తుర్కపల్లిలో మాట్లాడుతున్న హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌,

చిత్రంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, భాజపా

జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, తదితరులు

తుర్కపల్లి, న్యూస్‌టుడే: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాయం చేయకపోగా కనీసం పరామర్శించకపోవటం ఆయనకు కర్షకుల పట్ల ప్రేమ ఎంత ఉందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పక్క రాష్ట్రాల రైతులకు సాయం చేయవద్దని అనడం లేదని, మన రాష్ట్రంలో జరుగుతున్న బలవన్మరణాలు సీఎంకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబమే బాగుపడుతోందని, సబ్బండ వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేయొద్దని దేశంలోనే హుకుం జారీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో అవినీతిలో కూరుకుపోయిన తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించి, కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుబంధు ఇచ్చినట్లే ఇచ్చి పరోక్ష పద్ధతిలో దాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. మద్యం ధరలు విపరీతంగా పెంచి గ్రామాల్లో గొలుసు దుకాణాలు ఏర్పాటు చేయించి ఏటా రూ.40 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తెరాసకు వేసినట్లేనని పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేస్తే భాజపా అధికారంలోకి రావటం ఖాయమని తెలిపారు. తెరాసను ఓడించి భాజపాకు పట్టం కట్టాలని మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ పిలుపునిచ్చారు. అంతకు ముందు పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌, తెలంగాణ తల్లి విగ్రహాలకు రాజేందర్‌, భిక్షమయ్యగౌడ్‌ పూలమాలలు వేశారు. పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి ఈటల రాజేందర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేషం, జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్‌, సుభాష్‌రెడ్డి, మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు గోనె స్వరూప, మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ రవీంధ్రనాథ్‌గౌడ్‌, నాయకులు యాట పెంటయ్య, రాజయ్య, శ్రీనివాస్‌, నరేందర్‌నాయక్‌, దూప్‌సింగ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని