IPL 2024: ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్‌ఫ్యూజ్డ్‌ టీమ్‌ ఇదేనేమో : గ్రేమ్‌ స్మిత్

 ముంబయి వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. చివరి మూడు మ్యాచుల్లో గెలిచినా నాకౌట్‌ దశకు చేరుకోవడం కష్టమే. గెలుస్తామనుకున్న మ్యాచుల్లోనే ఓటమిపాలై అభిమానులను నిరాశకు గురి చేసింది.

Published : 04 May 2024 17:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ముంబయి ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. విజయానికి చేరువగా వెళ్లి బోల్తా పడిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. అందులో తాజాగా కోల్‌కతాతో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌ కూడా కావడం గమనార్హం. ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసినా లక్ష్య ఛేదనలో అది తడబాటుకు గురైంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ ముంబయి జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో తాను చూసిన అత్యంత కన్‌ఫ్యూజ్డ్‌ టీమ్‌ ఇదేనని వ్యాఖ్యానించాడు. 

‘‘కెప్టెన్ హార్దిక్‌ పాండ్య చాలా ఇబ్బంది పడుతున్నాడు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. దాంతో నిర్ణయాలు తీసుకోవడానికి తడబాటుకు గురవుతున్నాడు. కోల్‌కతాతో మ్యాచ్‌ను చూస్తే అలానే అనిపిస్తోంది. తిలక్‌ వర్మ, వధెరా మిడిలార్డర్‌లోకి పంపి.. నమన్‌ ధిర్‌ను వన్‌డౌన్‌లో ఆడించాడు. బ్యాటింగ్ లైనప్‌ను వాడుకోవడంలో తీవ్ర అయోమయానికి గురైనట్లుంది. తిలక్‌ను మూడో స్థానంలో, సూర్య 4, హార్దిక్‌ 5వ స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తే సరిపోయేది. టిమ్‌ డేవిడ్‌ లోయర్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడేయగలడు. అప్పుడు ప్రత్యర్థి బౌలింగ్‌పై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉండేది’’ అని స్మిత్ తెలిపాడు. 

బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఇలానా ఉండేది?: సెహ్వాగ్‌

‘‘కోల్‌కతా ఆండ్రి రస్సెల్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడాడు. ముంబయి హార్దిక్‌, టిమ్‌ డేవిడ్‌ లోయర్‌ ఆర్డర్‌లో వచ్చారు. అక్కడ బ్యాటింగ్‌కు వచ్చి ఏం సాధిద్దామని? అప్పటికి ఎన్ని బంతులు మిగిలిఉంటాయి? అదే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొస్తే.. మరిన్ని బంతులను ఆడొచ్చు. మ్యాచ్‌ను ఇంకాస్త వేగంగా ముగించే అవకాశం ఉంటుంది. ముంబయి ఈ మ్యాచ్‌లో ఛేజింగ్‌కు దిగింది. అయినా సరే టిమ్‌ డేవిడ్‌ 8వ స్థానంలో వచ్చాడు. పాండ్య అతడికంటే ముందు మాత్రమే క్రీజ్‌లో అడుగుపెట్టాడు. అంటే త్వరగా బ్యాటింగ్‌కు వస్తే ఔటైపోతామని భావిస్తున్నారా? గుజరాత్‌కు ఆడేటప్పుడు పాండ్య ఎక్కువ మ్యాచుల్లో నాలుగో స్థానంలోనే వచ్చేవాడు. ఇప్పుడు మాత్రం పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లను ముందుకుపంపి వీరు లోయర్‌లో వస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ ఇలాంటి చర్యలపై దృష్టిసారించాలి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని అడగాలి’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని