logo

ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..

ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రేపిన కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారం గురువారం రాత్రి ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.

Published : 10 Nov 2023 05:13 IST

ఈనాడు, నల్గొండ, మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రేపిన కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారం గురువారం రాత్రి ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సూర్యాపేట నియోజకవర్గం టిక్కెట్‌ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తుంగతుర్తి టిక్కెట్‌ మందుల సామేలు, మిర్యాలగూడ టిక్కెట్‌ బత్తుల లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు.  వారి వివరాలు ఇలా..

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

అనుభవానికే పట్టం.. సూర్యాపేట నుంచి వరుసగా నాలుగోసారి, మొత్తం మీద తొమ్మిదోసారి పోటీ చేస్తున్న రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లింగాల. తొలిసారి తుంగతుర్తి నుంచి 1985లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన దామోదర్‌రెడ్డి ఇప్పటివరకు తుంగతుర్తి, సూర్యాపేటల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా వారి హయాంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. మాస్‌ నాయకుడిగా పేరున్న దామోదర్‌రెడ్డికి తుంగతుర్తి, పాలేరు, కోదాడల్లో అనుచరవర్గం ఉంది.

మందుల సామేల్‌

స్థానికుడికే అవకాశం.. భారాస వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న మందుల సామేల్‌ అక్కడ సరైన ప్రాధాన్యం దక్కడం లేదని నెలన్నర క్రితం పార్టీ ప్రచార కమిటీ కో ఛైర్మన్‌ పొంగులేటి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడి నుంచి పలువురు ఉద్దండులు టిక్కెట్‌ కోసం పట్టుబడినా ఇదే నియోజకవర్గానికి చెందిన సామేల్‌కు పార్టీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. ఈయనది అడ్డగూడూరు మండలం ధర్మారం. ఈయన గతంలో సుమారు ఐదేళ్ల పాటు భారాస ప్రభుత్వంలో గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

బత్తుల లక్ష్మారెడ్డి

ఊగిసలాడి.. చివరి వరకు ఊగిసలాడిన మిర్యాలగూడ కాంగ్రెస్‌ టిక్కెట్‌ బత్తుల లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 2020లో కాంగ్రెస్‌లో చేరి, వార్డు కౌన్సిలర్‌గా, పురపాలిక ఫ్లోర్‌ లీడర్‌గా ఎన్నికైన ఆయన కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు యజమానిగా ఉన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న ఆయన స్వగ్రామం. ప్రస్తుతం మిర్యాలగూడ హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని