logo

ప్రవాసాంధ్రులూ.. పారాహుషార్‌!

ఒక్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్‌ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది.

Updated : 06 May 2024 19:36 IST

గొడ్డలిపెట్టుగా కొత్త భూయాజమాన్య హక్కు చట్టం
ఆస్తులను పట్టించుకోకపోతే గద్దలు తన్నుకుపోతాయ్‌!
ఈనాడు, అమరావతి

తిరువూరుకు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. వీరికి సొంత మండలంలో ఐదెకరాల పొలం ఉంది. గ్రామంలో తెలిసినవారికే కౌలుకిచ్చారు. ఏటా కౌలు కూడా వసూలవుతోంది. అంతా సవ్యంగానే ఉంది. వృద్ధాప్యంలో ఉన్న భూయజమాని తన పొలాన్ని విక్రయించాలనుకున్నారు. తీరా రికార్డులను పరిశీలిస్తే రెండెకరాలు వేరే వ్యక్తుల పేరు మీద బదిలీ అయినట్టు అడంగళ్‌లో ఉంది. దీనికి వీఆర్వో నిర్వాకమే కారణం. ఇదేమిటంటూ వృద్ధ దంపతులు తహసీల్దారు మొదలుకుని జిల్లా కలెక్టరు కార్యాలయం వరకు ఏడాదిపాటు కాళ్లరిగేలా తిరిగారు. చివరకు మధ్యేమార్గంలో పరిష్కరించుకున్నారు.

-కొత్తగా రానున్న భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌) ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్‌వో) దగ్గరకు రెండేళ్ల వరకు ఎవరూ రాకపోతే.. మొదట దరఖాస్తు చేసిన వ్యక్తికే ఆ భూమిపై హక్కు లభిస్తుంది. అంటే.. యజమాని కౌలు వస్తుందికదా అని తన రికార్డులను పరిశీలించుకోకుండా రెండేళ్లు గడిపితే.. అంతే సంగతన్నమాట!


నందివాడ మండలంలో వారసత్వం ప్రకారం ఓ మహిళకు ఆరెకరాల భూమి వచ్చింది. గ్రామ పెద్దల ద్వారా కౌలుకిచ్చారు. ఇటీవల పట్టాదారు పాసు పుస్తకాల కోసమని చెప్పి ఆమె నుంచి తెల్లకాగితాల మీద సంతకం తీసుకుని ఎకరం పొలం విక్రయించేశారు. రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో మార్పులూ చేసేశారు. ఇది తెలిసి ఆ మహిళ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తానెవ్వరికీ విక్రయించలేదని, తన భూమి ఎలా చేతులు మారిందని ప్రశ్నించారు. దిక్కున్నచోట చెప్పుకో.. కోర్టుకు పో.. అంటూ విక్రయించిన వ్యక్తి ఎదురుతిరిగారు. ఈ వివాదం ఇంకా నడుస్తోంది.

- కొత్త ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రకారం.. ఆమె నమ్మకంతో హైదరాబాద్‌లోనే ఉండి..


రికార్డులను పరిశీలించకుండా ఉంటే.. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే వేరే వ్యక్తులకు యాజమాన్య హక్కును టీఆర్వో కల్పించేందుకు వీలుంది. దీనిపై తిరిగి న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా అవకాశం లేదు.

క్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్‌ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది. ఈ రాకాసి చట్టాన్ని అడ్డుకోవడానికి ఇప్పటికే న్యాయవాదులు కోర్టుల్లో పోరాడుతున్నారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయినా జగన్‌ సర్కారు దిగిరావటం లేదు.

వాస్తవానికి విదేశాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో.. ఇతర నగరాలు, పట్టణాల్లోనో నివసిస్తున్న వేలాదిమంది సొంత గ్రామాల్లో ఉన్న ఆస్తులను లీజుకు లేదా అద్దెకు ఇస్తుంటారు. ఇలాంటివాటికి నకిలీ పత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకుంటే టీఆర్వో, అప్పిలేట్‌ అధికారి ద్వారా అక్రమార్కులు హక్కులు పొందేందుకు కొత్త చట్టం అవకాశం కల్పిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ నగరం సహా ఉమ్మడి జిల్లాలో బందరు, గుడివాడ, జగ్గయ్యపేటతో పాటు ఇతర పట్టణాల్లోనూ ఆస్తులను దొంగదారిలో కొట్టేసేందుకు కొత్త చట్టం మార్గం చూపుతోందని చెబుతున్నారు. సొంతప్రాంతాల్లో ఆస్తులుండి.. వేరేచోట ఉన్నవారికి చాలా సమస్యలొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ జగనన్న మాయ!!


కృష్ణాలో ఎన్‌ఆర్‌ఐలే ఎక్కువ..

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవాసాంధ్రులు ఎక్కువ. స్వగ్రామాలు, పట్టణాల్లో వారి పేరున స్థిరాస్తులున్నాయి. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన చాలామంది తమ ఆస్తుల సంరక్షణ బాధ్యతలను వేరే వ్యక్తులకు అప్పగించారు. తల్లిదండ్రులు వృద్ధులు కావటం, ఇతర వ్యక్తులను సంరక్షకులుగా ఉంచడం వారికి కూడా సమస్యగానే ఉంది.
  • ఇటీవల పెనమలూరు నియోజకవర్గంలో ఒక ఫౌండేషన్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేసేందుకు కొంతమంది ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ కూడా జరిగిపోయింది. దీనిపై తిరిగి ఎన్‌ఆర్‌ఐపైనే కేసులు పెట్టి వేధించేందుకూ ప్రయత్నించారు. ఆయన అమెరికా వెళ్లి అక్కడి నుంచి ఫిర్యాదు చేశారు.
  • అవనిగడ్డ నియోజకవర్గంలో న్యాయమూర్తిగా పని చేసి మృతి చెందిన వ్యక్తి తల్లికి కూడా భూవివాదంలో న్యాయం జరగలేదు. ఆమె కోర్టులో పోరాడుతున్నారు. ఇలాంటి వివాదాలున్న కేసులు వందల సంఖ్యలో ఉన్నాయి.
  • సిద్ధార్థ కళాశాలకు చెందిన స్థలాన్ని కొంతమంది ఆక్రమించి రాత్రికి రాత్రే బోర్డు పాతిన విషయం తెలిసిందే.
  • పెనమలూరు నియోజకవర్గంలో స్థలాలు, పొలాలు, భవనాల యజమానులు ఎక్కువ శాతం ఎన్‌ఆర్‌ఐలే. వీటిని సంరక్షకులే చూస్తున్నారు. ఇలాంటి వాటిని కొత్త చట్టం ప్రకారం టీఆర్వోతో మిలాఖతై రికార్డులు మార్చేస్తే చాలు.. ఆ తరువాత రెండేళ్ల వరకు అభ్యంతరాలేవీ రాకపోతే అక్రమార్కులకు ఆ ఆస్తిపై హక్కు లభించినట్టే. తిరిగి న్యాయస్థానాలకు వెళ్లే అవకాశమే లేదు.
  • విజయవాడ నగరంలోనూ, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోనూ ఎన్‌ఆర్‌ఐలు, వారి వారసులకు ఎక్కువ స్థిరాస్తులున్నాయి. వీరు జాగ్రత్త పడాలని న్యాయవాదులు సైతం హెచ్చరిస్తున్నారు.
  • ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారమైతే.. తమ ఆస్తులు ఆక్రమణకు గురైన విషయం తెలిస్తే న్యాయస్థానాలకు వెళ్లి పోరాడే అవకాశం ఉంది. కొత్తగా భూయాజమాన్య హక్కు చట్టం ప్రకారమైతే ఆ అవకాశమే ఉండదు. టీఆర్వో ల్యాండ్‌ టైట్లింగ్‌ అప్పిలేట్‌ అధికారి నిర్ణయమే కీలకం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని