logo

కొత్త కోడళ్లకు దారేది..!

మిర్యాలగూడ మండలానికి చెందిన ఓ యువతి రెండేళ్ల కిందట దేవరకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కొత్తగా తన పేరిట రేషన్‌కార్డు రావాలంటే తల్లిదండ్రుల రేషన్‌ కార్డులో ఉన్న పేరును తొలగించుకొని అత్తారింటి వద్ద దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Updated : 07 Mar 2024 06:06 IST

మిర్యాలగూడ మండలానికి చెందిన ఓ యువతి రెండేళ్ల కిందట దేవరకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కొత్తగా తన పేరిట రేషన్‌కార్డు రావాలంటే తల్లిదండ్రుల రేషన్‌ కార్డులో ఉన్న పేరును తొలగించుకొని అత్తారింటి వద్ద దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో అప్పుడే పుట్టింటి కార్డులో పేరు తొలగించుకుంది. కొత్తగా రేషన్‌కార్డులు ప్రభుత్వం ఇవ్వక పోగా ఆమెకు ప్రస్తుతం ఏ పథకం వర్తించని పరిస్థితి. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లాలో గత పదేళ్లలో వివాహాలైన కోడళ్లందరిది. వీరు సుమారు పదివేలకు పైగా ఉంటారని అంచనా. ప్రస్తుతం ఏప్రిల్‌ వరకు ఉన్న పెళ్లిళ్ల సీజన్‌లో మరో ఐదువేల వరకు పెరిగే అవకాశం ఉండగా.. వారికీ రేషన్‌ కార్డుల మంజూరు విషయం ప్రశ్నార్థకంగా మారనుంది.


మిర్యాలగూడ, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో..కొత్త కోడళ్లు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ పనిచేయక పోవటంతో వారికి దారి కరవైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. దీనికి ప్రధానంగా రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ప్రజాపాలన దరఖాస్తులను ప్రభుత్వం వార్డులు, గ్రామాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్వీకరించింది. దూర ప్రాంతాల్లో వివిధ పనులు, ఉపాధి, ప్రైవేటు ఉద్యోగాల కోసం వెళ్లిన వారు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. మరోవైపు కొత్తగా వివాహాలై అత్తారింటికి వచ్చే కోడళ్లకు.. ప్రత్యేకంగా వారి కుటుంబాలకు రేషన్‌ కార్డు తీసుకోవాలంటే సాధ్యపడటం లేదు. కొత్తగా రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి సైతం కార్డులు అందించలేదు. వీరు కూడా ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు అందుకోలేని పరిస్థితి నెలకొంది.

రాయితీ గ్యాస్‌, గృహజ్యోతి అందక ఇక్కట్లు..

గృహజ్యోతి పథకం కింద రేషన్‌ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి జీరో బిల్లులు ఇస్తున్నారు. అర్హులై ఈ పథకం వర్తించక పోతే పురపాలిక, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. చాలా మంది కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు అందిస్తున్నా.. వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు వెబ్‌సైట్‌ పనిచేయటం లేదు. తర్వాత చేస్తామని సిబ్బంది చెబుతుండగా.. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పట్టణాల్లో ఉన్నవారు తమ గ్రామాల్లో దరఖాస్తులు చేసుకోగా.. వారికి ప్రస్తుతం పట్టణాల్లో వర్తించే ఉచిత పథకాల విషయంలో సందిగ్ధత నెలకొంది. అద్దెకు ఉన్నా వర్తింప జేస్తామని చెప్పటంతో మరోసారి వీరంతా దరఖాస్తులు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని