logo

ఇంటి మీద.. అవార్డుల పంట

మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.

Updated : 19 Apr 2024 06:34 IST

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి. సూర్యాపేట పట్టణంలో మిద్దెపైన పంటలు పండిస్తున్న వారిలో ఏటా ఒకరిద్దరు పురస్కారాలు సాధిస్తున్నారు. ఈ సారి ముగ్గురు ఉగాది పురస్కారాలు పొందారు. రసాయనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లపై కూరగాయల సాగుపై చాలా మంది శ్రద్ధ కనబరుస్తున్నారు. పురపాలిక అధికారులు కూడా రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సాగు చేపట్టేవారు రూ.1500 చెల్లిస్తే రూ.10 వేల విలువైన సంచులు, విత్తనాలు, ఎరువులు, రసాయనాలు అందిస్తున్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ చాలామంది మిద్దె సాగుకు చేపడుతున్నారు. సూర్యాపేట పట్టణంలో ఇప్పటి వరకు సుమారు 1060 మంది తమ ఇళ్లపైన ప్రత్యేకంగా ఇనుప పందిళ్లు ఏర్పాటు చేసుకొని వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇక్కడ చేపట్టే తోటలను వివిధ పరిశోధన సంస్థలు ఏటా పరిశీలించి పురస్కారాలు అందిస్తున్నాయి. ఈసారి ఆదిగురు భారత సంఘం, గోఆధారిత ప్రకృతి వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యాన శాఖ సమక్షంలో అందించే ఉగాది పురస్కారాలకు సూర్యాపేటకు చెందిన నల్లపాటి మమత, వందనపు శ్రీదేవి, నాతాల మన్మథరెడ్డి ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఉద్యాన కళాశాలలో ఉగాది పురస్కారాలు అందించి సన్మానించారు.


ఆనందంగా ఉంది - నాతాల మన్మథరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సూర్యాపేట

 ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో మిద్దెపైన కూరగాయలు పండిస్తున్నాం. కాకర, బీర, బెండ, చిక్కుడు, సొర, వంగ, టమాట, పచ్చిమిర్చి, దొండ, దోస, బుడందోస, తదితర కూరగాయలు సాగుచేస్తున్నాం. తోటకూర, బచ్చలి, తెల్లగలిజేరు, గంగవావిలి ఆకుఊకర, పుదీన ఆకుకూరలతోపాటు అంజీర, డ్రాగన్‌ ప్రూట్‌, ఫాల్సా, బార్బడ్‌, చెర్రీస్‌ పండ్ల మొక్కలు పెంచుతున్నాం. ఉగాది పురస్కారం పొందినందుకు ఆనందంగా ఉంది. ఈ పురస్కారం నాతోపాటు మరికొంతమంది సాగు చేసేలా ప్రోత్సాహాన్నిస్తుంది.


బాధ్యత పెరుగుతోంది
- నల్లపాటి మమత, సూర్యాపేట

ఐదేళ్ల నుంచి మిద్దెపైన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. సొంతంగా ఎరువు తయారు చేసి మొక్కలకు అందిస్తున్నా. ఇప్పటి వరకు రైతునేస్తం, ఆదిగురు భారత సంఘం, గోఆధారిత ప్రకృతి వ్యవసాయ సంస్థ వారు పురస్కారాలు దక్కాయి. మిద్దెసాగు బాగుందని గడ్డిపల్లి కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం) వారు మహిళా దినోత్సవం రోజు సన్మానించి జ్ఞాపిక అందించారు. మిద్దెసాగు మొట్టమొదట చేపట్టడంతో 2020లో పుర అధికారులు గుర్తించి సన్మానించారు. మిద్దె సాగు వల్ల ఆరోగ్యం, ఆనందంతోపాటు శారీరకంగా వ్యాయామం కలుగుతోంది. పురస్కారాలు రావడం వల్ల మరింత బాధ్యత పెరుగుతోంది. భవిష్యత్తులో తల్లిదండ్రులు ‘టెర్రస్‌ గార్డెన్‌’ను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలి.


ఆరేళ్లుగా సాగు చేస్తున్నాం
- వందనపు శ్రీదేవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, భూసేకరణ, నల్గొండ

ఆరేళ్లుగా మిద్దెతోట సాగు చేస్తున్నాను. ఇంట్లో పండించిన కూరగాయలనే 90 శాతం తింటున్నాం. పండ్లు, పూల మొక్కలు కూడా పెంచుతున్నాను. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నాం. దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. రసాయనాలు లేని పంట వల్ల ఆరోగ్యం బాగుంటోంది. ఇంట్లోని కూరగాయలు, పండ్ల వ్యర్థాలు కూడా తిరిగి ఎరువుగా మార్చుకుంటున్నాం. ఉగాది పురస్కారం రావడంతో మిద్దెతోటపై మరింత శ్రద్ధ పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని