logo

పట్నం నుంచి పల్లెదాకా..

జిల్లాలో గంజాయి ఘాటెక్కుతోంది. నగరం, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకూ విస్తరించింది. యువత విచ్చలవిడిలా వినియోగిస్తూ మత్తులో నిండా మునుగుతోంది.

Published : 15 Jun 2023 05:56 IST

 విచ్చలవిడిగా గంజాయి వినియోగం
కేసులకు నెరవని విక్రయదారులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవిభాగం

జిల్లాలో గంజాయి ఘాటెక్కుతోంది. నగరం, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకూ విస్తరించింది. యువత విచ్చలవిడిలా వినియోగిస్తూ మత్తులో నిండా మునుగుతోంది. సిరులు కురిపిస్తున్న ఈ దందాలో అనేక మంది భాగస్వాములవుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల్లో రూ.లక్షల విలువ చేసే సరకు పట్టుబడి, కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ విక్రేతలు వెనక్కి తగ్గడం లేదు.

ఆరు నెలల్లో 30 కేజీలు

గంజాయిని ఎక్కువగా ఒడిశా, గోవా, మహారాష్ట్రల నుంచి రైలు, బస్సు మార్గాల ద్వారా జిల్లాకు తీసుకొస్తున్నారు. గత ఆరు నెలలుగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 30 కిలోల వరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న 17.2 కిలోలు పట్టుబడింది. పోలీసుశాఖ ఆధ్వర్యంలోనూ గత రెండు నెలల్లో అయిదు కేసులు నమోదు చేశారు. గతనెల ఒకటో ఠాణా పరిధిలో పది కిలోల వరకు సరకు పట్టుకుని, నాందేడ్‌ నుంచి సరఫరా చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో నాలుగో ఠాణా పరిధిలోని అమ్మ వెంచర్‌లో విక్రయదారులను పట్టుకున్నారు.

యువతే లక్ష్యంగా..

ఎక్కువగా యువతనే లక్ష్యంగా చేసుకుని గంజాయి దందా నడుస్తోంది. నగరంలోని రద్దీ ప్రాంతాలను అమ్మకాలకు అనువుగా మార్చుకుంటున్నారు. చిన్నచిన్న పొట్లాలు చేసి కళాశాలల్లో విక్రయిస్తున్నట్లు పలు ఠాణాల్లో కొందరిపై కేసులు నమోదై ఉన్నాయి.

సరఫరాపై ఉక్కుపాదం

జిల్లాలో గంజాయి సరఫరాపై నిఘా పెంచాం. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే మార్గాలని గుర్తించి పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు మా సీఐలు స్వప్న, మధుసూదనరావులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా విక్రయిస్తున్నారని తెలిస్తే పోలీసులకు లేదా మాకు సమాచారం ఇవ్వాలి.

 కిషన్‌, ఏసీ, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని