logo

బడుల బలోపేతానికి కృషి

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు

Published : 20 Apr 2024 06:41 IST

అమ్మ ఆదర్శ కమిటీలతో అభివృద్ధి పనులు

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు. లోపల కూరలు, బయట అన్నం వండుతున్నారు. బడి ఆవరణలోనే వంట గది నిర్మించారు. కానీ, పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రారంభానికి నోచుకోలేదు.

 న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం: జిల్లా వ్యాప్తంగా అనేక బడుల్లో ఇలాంటి సమస్యలు తిష్ఠ వేశాయి. వీటికి వేసవి సెలవుల్లోనే మోక్షం కలిగించేందుకు ప్రభుత్వం ‘అమ్మ ఆదర్శ కమిటీలను నియమించింది. ఫలితంగా పాఠశాలల్లో 2024- 25 విద్యా సంవత్సరంలో అనేక సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇది వరకు ఉన్న యాజమాన్య కమిటీల స్థానంలో కొత్తగా కమిటీలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించనున్నారు.  

యూడైస్‌ ప్రక్రియ ఆధారంగా..

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల బడుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అధికారులు యూడైస్‌ ప్రక్రియ ద్వారా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. మన ఊరు మన బడి కింద ఎంపికైన బడుల్లో పనులు నామమాత్రమే పూర్తయ్యాయి. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా బడుల్లో తాగునీటి సమస్యలకు మరమ్మతులు, తరగతి గదుల్లో విద్యుత్తు సంబంధిత పనులు, బాలికలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సమస్యలు తీర్చనున్నారు. ఇప్పటికే కమిటీలకు సంబంధించిన నియామకాలు పూర్తయ్యాయి. పనులు పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు పూర్తి చేయనున్నారు. మన ఊరు మన బడి పథకం కింద ఎంపికై అపరిష్కృతంగా ఉన్న పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.  


ప్రత్యేక బృందాల పరిశీలన
- రాజు, డీఈవో-కామారెడ్డి

సర్కారు బడుల్లో నియమించిన అమ్మ ఆదర్శ కమిటీల ఆధారంగా పనులు జరుగుతాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బడుల్లో సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపాం. సమస్య తీవ్రంగా ఉన్న బడులను గుర్తించి వెంటనే పనులు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని