logo

తుది అంకానికి ఎన్నికల ప్రక్రియ

జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. మూడు జిల్లాల అధికారులు అహర్నిశలుగా శ్రమిస్తుండడంతో ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. లోక్‌సభ పరిధిలో ఈ నెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్‌ ప్రక్రియ కోసం ఓటర్లకు చీటీల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.

Published : 06 May 2024 04:40 IST

80 శాతం ఓటరు చీటీల పంపిణీ పూర్తి
కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

కామారెడ్డిలో గతంలో ఏర్పాటు చేసిన దివ్యాంగ, మహిళా పోలింగ్‌ కేంద్రం

జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. మూడు జిల్లాల అధికారులు అహర్నిశలుగా శ్రమిస్తుండడంతో ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. లోక్‌సభ పరిధిలో ఈ నెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్‌ ప్రక్రియ కోసం ఓటర్లకు చీటీల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఆయా పోలింగ్‌కేంద్రాల్లో వసతులు కల్పించాలని ఇప్పటికే మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు, సిబ్బందికి అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

నియోజకవర్గానికి ఆదర్శ, మహిళా పోలింగ్‌ కేంద్రాలు

ప్రతి నియోజకవర్గంలో నమూనా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా నమూనా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 8 ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు, 5 మహిళా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో ఒక యూత్‌ పోలింగ్‌కేంద్రం, మరో దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ లెక్కన జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 56 ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు, 35 మహిళా పోలింగ్‌ కేంద్రాలు, ఏడేసి చోప్పున యూత్‌, దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

ఈ నెల 8 వరకు గడవు

బూత్‌స్థాయి అధికారులు ఓటరు చీటీలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఓటరుగైడ్‌లను కూడా అందజేస్తున్నారు. ఈ గైడ్‌లో ఓటరుకు సూచనలు, సలహాలు అందించారు. ఈ నెల మూడో తేదీ వరకు జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80 శాతం (13,12,604 మందికి) ఓటరు చీటీల పంపిణీ పూర్తయింది. 8వ తేదీలోగా ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది.

పారదర్శకత కోసం యాదృచ్ఛికీకరణ

ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల అధికారుల(పీవో, ఏపీవో) యాదృచ్ఛికీకరణ(ర్యాండమైజేషన్‌) ప్రక్రియ పూర్తి చేశారు. వీరికి మరోసారి యాదృచ్ఛికీకరణ చేసిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్‌ స్టేషన్‌లో విధులు కేటాయించేది పేర్కొంటారు. ఈవీఎంల యాదృచ్ఛికీకరణ మొదటి, రెండో దశ పూర్తి చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో రెండో ఈవీఎం అదనంగా కావాల్సి వచ్చింది. 1973 ఈవీఎంల సేవలను అదనంగా వినియోగించుకోనున్నారు. రిజర్వ్‌లో ఉంచిన ఈవీఎంల యాదృచ్ఛికీకరణ పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని